తెలంగాణాలో మరో 4368 ఈవీఎంలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ప్రచారంపై మరో 8 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అదే సమయంలో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల పోలింగ్ కు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈసీ తప్పనిసరి పరిస్ధితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.  నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం తాజాగా మరో 4368 ఈవీఎంలకు ఆర్డర్ పెట్టింది.  గతంలో 4978 ఈవీఎంలను మంజూరు చేసిన ఈసీ ఇప్పుడు తాజాగా ఈ అదనపు ఈవీఎంల కోసం ఆర్డర్ ఇచ్చింది.

దీనికి కారణం ఎన్నికల్లో దాఖలైన భారీ నామినేషన్లే. సాధారణంగా ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కోసం ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయన్న దానిపై ఈసీకి ఓ అంచనా ఉంటుంది.  కానీ ఈ అంచనాల్ని కూడా దాటేసి నామినేషన్లు దాఖలు కావడంతో అదనపు ఈవీఎంలను తెప్పించాల్సి వస్తోంది. తెలంగాణలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో అదనంగా 4,368 యూనిట్లు అవసరం అయ్యాయి. 

అయితే ఈ ఈవీఎంలన్నీ హైదరాబాద్ జిల్లాకే అవసరం అవుతుండటం ఇక్కడ మరో విశేషం. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో తాజాగా ఆర్డర్ పెట్టిన ఈవీఎంలతో కలిపి మొత్తం ఈవీఎంల సంఖ్య 9,346కు చేరింది. ఇది 125 శాతం అదనంగా అంచనా వేశారు. హైదరాబాద్ పార్లమెంటు సీటు పరిధిలోకి వచ్చే నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి 32 మందికి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం

కాగా.. ఈ సెగ్మెంట్లలో 16 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నందున 11 నియోజకవర్గాలకు రెండు యూనిట్లు అవసరం అవుతున్నాయి. అలాగే మూడు నియోజకవర్గాల్లో 16 కంటే తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ఒక బ్యాలెట్ యూనిట్ మాత్రమే సరిపోతుంది.