వివేకానంద రాక్ స్మారక శిల రూపకర్త ఏకనాథ్ రానడే

కె భవాని శంకర్                                                                                                                                                   * జన్మదిన నివాళి
ఆర్ఎస్ఎస్ లో మొదటి తరం సారధులలో ఒకరైన ఏకనాథ్ రామకృష్ణ రనడే నవంబర్ 19, 1914న మహారాష్ట్రాలో అమరావతి జిల్లా టిల్టిలా గ్రామంలో జన్మించారు. అన్నయ్య దగ్గర చదువుకోవడానికి నాగపూర్ వచ్చాడు. అక్కడ ఆయనకు సంఘ్ నిర్మాత డాక్టర్ హెడ్గేవార్ తో పరిచయం ఏర్పడింది. 
అతను చిన్నతనం నుండి చాలా ప్రతిభావంతుడు, కొంటెవాడుగా పేరొందారు. అనేక సార్లు అతను అల్లరి కారణంగా శాఖకు దూరం కావలసి వచ్చింది. అయినా పట్టు విడువక తిరిగి అదే శాఖలో చేరేవాడు. ఈ స్వభావం వల్ల తాను తలపెట్టిన ఎటువంటి పనైనా పూర్తి చేసే వరకు పట్టుదలగా పనిచేయడం చిన్నతనం నుండే అలవరచుకున్నారు.

మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, డాక్టర్ హెడ్గేవార్ వద్దకు వెళ్లి ప్రచారక్ కావాలనే కోరికను వ్యక్తం చేశాడు. కానీ డాక్టర్ జీ అతనిని మరింత చదవమని అడిగారు. దానితో తత్వశాస్త్రంలో బిఎ హానర్స్ చేసి, మధ్యప్రదేశ్ లోని సాగర్ యూనివర్సిటీలో ఎల్  ఎల్ బి చదివారు.  ఆ తర్వాత, 1936లో ఆయన ప్రచారక్ గా మారారు. 

 
మొదట్లో ఆయనకు నాగ్‌పూర్ చుట్టుపక్కల పని అప్పగించారు. 1938లో మహాకౌశల్. 1945లో, అతను మొత్తం మధ్యప్రదేశ్‌కు ప్రాంత ప్రచారక్ అయ్యేరు. 1948లో గాంధీ హత్యకు సంబంధించిన తప్పుడు ఆరోపణతో సంఘ్‌ను నిషేధించారు. సంఘ్‌లోని ప్రధాన అధికారులందరూ పట్టుబడ్డారు.  అటువంటి పరిస్థితిలో, నిషేధంకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సత్యాగ్రహ బాధ్యత ఏకనాథ్ కు అప్పగించారు. 
 
అజ్ఞాతంలో ఉండి దేశవ్యాప్తంగా పర్యటించారు, ఆ కాలంలో సత్యాగ్రహం చేయడానికి 80,000 మంది స్వయంసేవక్ లకు నాయకత్వం వహించారు. సంఘ్, ప్రభుత్వం మధ్య చర్చలకు మౌళిచంద్ర శర్మ, ద్వారకా ప్రసాద్ మిశ్రా వంటి ప్రభావవంతమైన వ్యక్తులను ఆయనే సిద్ధం చేశారు. నాటి హోమ్ మంత్రి సర్దార్ పటేల్ తో సంప్రదింపులు ఆయన సారథ్యంలోనే జరిగాయి.

ఆ తర్వాత ఏడాదిపాటు ఢిల్లీలోనే ఉన్నారు. 1950లో ఆయనకు ఈశాన్య భారతం బాధ్యతలు అప్పగించారు. 1953 నుండి 56 వరకు సంఘ్ అఖిల భారత ప్రచారక్ ప్రముఖ్ గా, 1956 నుండి 62 వరకు, సర్ కార్యవాహగా   ఉన్నారు. ఈ కాలంలో, ఆయన సంఘ్ కార్యంతో పాటు,  స్వయంసేవక్ లు చేపట్టిన పలు సంస్థలు త్వరితగతిన విస్తరించడం ప్రారంభమైనది. 

 
నిషేధం సమయంలో సంఘ్ చాలా అప్పులు చేయాల్సి వచ్చింది. గురూజీగా పేరొందిన ద్వితీయ సర్ సంఘచాలక్ ఎం ఎస్ గోల్వాల్కర్  51వ జయంతి సందర్భంగా సేకరించిన నిధి ద్వారా సంఘ్‌ను ఆ సంక్షోభం నుంచి ఏక్‌నాథ్ సంఘ్ ను బైటపడేటట్లు చేశారు.  1962లో అఖిల భారత బౌద్ధిక ప్రముఖ్ అయ్యారు.
 
వివేకానంద స్మారక శిల నిర్మాణం
 
1963లో స్వామి వివేకానంద సత్తా జయంతి సందర్భంగా కన్యాకుమారిలో స్వామిజీ ధ్యానం చేసిన శిలపై స్మారక చిహ్నం నిర్మించాలని సంఘ్ నిర్ణయించింది. గురూజీ ఈ బాధ్యతను ఏకనాథ్‌ కుఅప్పగించారు. దక్షిణాదిలో క్రైస్తవుల ప్రాబల్యం పెరుగుతూ ఉండటం, వారితో పాటు అప్పటి కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాల నుండి ఎన్నో అవరోధాలు ఎదురు కావడంతో మొదట్లో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. 
 
అయితే, ఎంతో సహనం, చాతుర్యంతో ఏక్‌నాథ్ ఆ సమస్యలు అన్నింటిని అధిగమించి కేవలం ఆరేళ్ళ వ్యవధిలో చారిత్రాత్మకమైన స్మారక చిహ్నాన్ని అక్కడ నిర్మించారు.  అయితే, ఈ సందర్భంగా ఎటువంటి రాజకీయాలు చొరబడకుండా, అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు సమీకరించడం ఆయన సంఘటనా చతురతను అద్దం పడుతుంది.
 
వివేకానంద శిల నిర్మాణానికి నాటి కేంద్ర  విద్య,సాంస్కృతిక మంత్రి హుమాయన్ కబీర్ అనుమతి నిరాకరించారు. దానితో అన్ని పార్టీలకు చెందిన 300 మంది ఎంపీలతో మద్దతుగా వినతిపత్రం సమర్పించడంతో అనుమతి ఇవ్వక తప్పలేదు. సంప్రాదయకంగా ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలు, సాధు సంతతుల నుండి కూడా ఈ ప్రాజెక్టుకు ఆయన మద్దతు సమీకరింప గలిగారు.
 
కన్యాకుమారి స్మారక చిహ్నం కోసం చాలా నిధులు అవసరమైంది. అయితే, సంపన్నులు, పారిశ్రామిక వేత్తల నుండి ఆ మొత్తం సేకరించి నిర్మాణం పూర్తిచేసేందుకు రానడే ఇష్టపడలేదు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఈ నిర్మాణంలో ఉండాలని తలపెట్టారు.
 
ప్రతి పురుడు నుండి రూ 1 విరాళం
 
అందుకనే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి మారుమూల ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశం అంతటా స్థానిక సంస్థలు, రాష్త్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల నుండి కూడా నిధులు సేకరించే మహత్తర ప్రయత్నం చేశారు. కనీసం ఒక రూపాయి విరాళంగా ఇవ్వాలని లక్షలాది మంది ప్రజలకు స్ఫూర్తి కలిగించారు. 
 
తద్వారా ఈ స్మారక నిర్మాణంలో తనకు భాగస్వామి అయ్యానని సంతృప్తి అసంఖ్యాక ప్రజలలో కలిగించే ప్రయత్నం చేశారు. పాఠశాల విద్యార్థులు కూడా ఈ మహత్తర యజ్ఞంలో పాల్గొన్నారు. బహుశా భారత దేశ చరిత్రలోనే సాధారణ ప్రజలకు సహితం ఇటువంటి మహాయజ్ఞంలో భాగస్వామ్యం కల్పించిన తొలి ప్రయత్నం ఇదే అని చెప్పవచ్చు.
 
ఈ విధంగా అందరి సహకారంతో నిర్మించిన స్మారకాన్ని రాష్ట్రపతి  వరాహగిరి వెంకటగిరి సెప్టెంబర్ 2, 1970లో ప్రారంభించారు. అయితే, ఈ కేంద్రము ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా దేశ ప్రజలకు ఓ స్ఫూర్తి కేంద్రంగా మలచే విధంగా ప్రణాళికలు రూపొందించారు. 1972లో వివేకానంద కేంద్రం కార్యకలాపాలను సేవ వైపు మళ్లించారు. 
 
యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి దేశంలోని అటవీ ప్రాంతాలకు పంపారు. సాధారణ ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు, సేవా కార్యక్రమాలతో పాటు వారిలో మంచి ఆలోచనలు కలిగించే విధంగా  పంపించారు. ఈ పని నేటికీ కొనసాగుతోంది. అనేక ప్రచురణల ద్వారా భావవ్యాప్తి కూడా వివేకానంద కేంద్ర చెప్పబడుతున్నది.
ఆయన స్వయంగా వివేకానందుని ఎంపిక చేసిన రచనలతో  “రౌజింగ్  కాల్ టు హిందూ నేషన్” అనే గ్రంధాన్ని శతజయంతి నివాళిగా ఆయన రచనను ప్రచురించారు.  ఈ విధంగా శారీరక, మానసిక ఒత్తిడి కారణంగా 68 ఏళ్లకే ఆయన 1982 ఆగస్టు 22న మద్రాసులో గుండెపోటుతో మరణించాడు. కన్యాకుమారిలో నిర్మించిన స్మారకం నుంచి స్వామి వివేకానందతో పాటు ఏకనాథ్ రనడే కూడా నిత్యం స్ఫూర్తి కలిగిస్తుంటారు.