2027 నాటికి ప్రతి ప్రయాణీకుడికి కన్ఫర్మ్ రైల్ టికెట్

ప్రతి ప్రయాణీకుడు 2027 నాటికి కన్ఫర్మ్ టిక్కెట్‌తో రైళ్లలో ప్రయాణించవచ్చని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించామని రైల్వే వర్గాలు తెలిపాయి. రైల్వేల విస్తరణ ప్రణాళికలలో ప్రతిరోజూ కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించాయి. 
 
దీపావళి వేళ ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఛట్ పూజ కోసం బీహార్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించి 40 ఏళ్ల వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. దీపావళి వంటి పండుగల సందర్భంగా సొంతూళ్లకు పయనమయ్యే వారితో రైల్వే, బస్ స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది.
 
ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారన్న ప్రశ్నకు రైల్వే వర్గాలు బదులిస్తూ  ఏటా కొత్త ట్రాక్‌ల నిర్మాణం చేపడతామని, సంవత్సరానికి 4,000-5,000 కిలోమీటర్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నామని తెలిపాయి. ప్రస్తుతం రోజుకు 10,748 రైళ్లు నడుస్తున్నాయని, దీనిని 13,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించాయి. 
 
వచ్చే 3-4 సంవత్సరాల్లో 3,000 కొత్త రైళ్లను ట్రాక్‌లపైకి తీసుకురావాలనేది ప్రణాళిక అని వర్గాలు పేర్కొన్నాయి.  ప్రతి సంవత్సరం 800 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తుంటారు. ఈ సామర్థ్యాన్ని 1,000 కోట్లకు పెంచాలనేది ప్రణాళిక. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి కూడా రైల్వేలు కృషి చేస్తున్నాయి. 
 
ఇందులో భాగంగా మరిన్ని ట్రాక్‌లు వేయడం, వేగాన్ని పెంచడం వంటివి ఉంటాయి. రైలు ఆగిన తర్వాత వేగాన్ని అందుకోడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వేగాన్ని పెంచడం చాలా అవసరం. రైల్వేల అధ్యయనం ప్రకారం ఢిల్లీ నుంచి కోల్‌కతా ప్రయాణంలో రైలు త్వరణం, వేగాన్ని పెంచితే 2.20 గంటల సమయం ఆదా అవుతాయి. 
 
పుష్ అండ్ పుల్ టెక్నిక్ త్వరణం, వేగాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఏటా దాదాపు 225 రైళ్లు తయారవుతుండగా.. వీటిలో పుష్ పుల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ల యాక్సిలరేషన్, డీసీలరేషన్ సామర్థ్యం ప్రస్తుత రైళ్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ.