ఓటమి భయంతో కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏదేమైనా తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని భరోసా వ్యక్తం చేశారు.  గజ్వేల్‌లో 114 మంది ధరణి బాధితులు నామినేషన్ వేశారని, కామారెడ్డిలోనూ 58 మంది నామినేషన్ దాఖలు చేశారని చెబుతూ వారందర్నీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేయడమే బీజేపీ లక్ష్యమని  చెబుతూ బీజేపీ తరపున 39 మంది బీసీలో ఉన్నారని తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ 22 మంది బీసీలకు, బిఆర్ఎస్ నుండి 23 మంది  బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గజ్వేల్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించగానే కేసీఆర్ భయపడ్డారని పేర్కొంటూ  అందుకే గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈసారి గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓడిపోతారని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.  కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఈ ఎన్నికల్లో ఓడిపోతారని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్‌ను గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తెలిపారు.
ఎన్డీఏ భాగస్వామిగా తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని, బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థుల తరుపున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.  బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అంబేడ్కర్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. 

కేసీఆర్ మాటలే కోటలు దాటుతాయి

బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేసిన ఈటల రాజేందర్‌కు వీణవంక మండలంలోని ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలతో కోటలు కడతారు తప్ప మన సమస్యలు తీర్చరని విమర్శించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి నేడు గంగపాలైందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తోందని ఇప్పటివరకు ఎంత మంది యువతకు ఉద్యోగం కల్పించారని ప్రశ్నించారు.