నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 608 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.  రాష్ట్రంలో అతి తక్కువగా నారాయణపేట నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు.  ఇక బాన్సువాడలో 7 మంది బరిలో ఉండగా… బాల్కొండలో 8 మంది పోటీ చేయనున్నారు. 
అత్యధిక నామినేషన్లు దాఖలైన కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్‌లో 70 మంది స్వతంత్రులు ఉపసంహరించుకోవడంతో 44 మంది బరిలో నిలిచారు. ఇక కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులు కేటాయించింది.  జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఆయా పార్టీల ఎన్నికల చిహ్నాలనే కేటాయించారు. 
రిజిస్టర్డ్ పార్టీలకు వారి వినతి మేరకు కామన్ సింబల్ కేటాయించగా, ఇండిపెండెంట్ అభ్యర్థులకు వారు కోరుకున్న గుర్తులను కేటాయించారు. ఒకే గుర్తును ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది కోరుకున్న చోట లాటరీ తీశారు.  బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల వరుస క్రమాన్ని కూడా ఖరారు చేశారు. దీంతో గురు, శుక్రవారాల్లో అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లను ముద్రించనున్నారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. 
రాష్ట్రంలోని అత్యధిక నియోజకవర్గాల్లో 16 మందిలోపే అభ్యర్థులు ఉండటంతో ఒకే బ్యాలెట్ యూనిట్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మూడు బ్యాలెట్ యూనిట్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో నామినేషన్‌ల ప్రక్రియ పూర్తి కావడంతో పోలింగ్ స్లిప్పుల పంపిణీని ఎన్నికల అధికారులు ప్రారంభించారు. కొన్ని జిల్లాల్లో బుధవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 25లోగా పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయనున్నారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’
సెల్, జీన్ థెరపీ రంగంలో భారత్ బయోటెక్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!