
ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్య సాయి జిల్లాలో మడకశిర సమీపంలోని హెంజేరు (హేమావతి) రాజధానిగా పాలించిన నోలంబ పల్లవులు- చిక్కబళ్ళాపురం వద్ద గల నంది కేంద్రంగా పాలన సాగిస్తున్న బాణరాజుల మధ్య జరిగిన ఘోర యుద్ధ ప్రదేశాన్ని పెనుకొండ సమీపంలోని చోళెమర్రిగా గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు.
నోలంబపల్లవుల రాజ్యం, శిల్పకళాచాతుర్యం, సంస్కృతి తదితర అంశాలపై చేస్తున్న పరిశోధనలో భాగంగా చోళెమర్రి, రొద్దం ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నోలంబ వాడి-32000 రాజ్యాన్ని మహేంద్ర నోలంబాధి రాజ (సా.శ. 875-897) పాలిస్తున్న కాలంలో నోలంబపల్లవులకు బాణులకు ఘోర యుద్ధం జరిగింది.
ఆ యుద్ధంలో మహేంద్రరాజ విజయం సాధించాడు.
బాణరాజులు, వైదంబులు కలిసి నోలంబ రాజ్యంపై దండెత్తారు. నోలంబ మహేంద్రకు పశ్చిమ గంగరాజులు బాసటగా నిలిచారు. నేటి చోళెమర్రి గ్రామాన్ని నాడు సోరెమడిగా పిలిచేవారు. సోరెమడి యుద్ధంగా చరిత్రలో ఖ్యాతిగాంచింది. నోలంబ రాజ్యంలో భాగమైన సోరెమడిని స్వాధీనం చేసుకోవాలని తద్వారా నోలంబ రాజ్యంపై తమ పట్టును కొనసాగించాలని బాణులు- వైదంబులు కలలు కన్నారు. అయితే మహేంద్రరాజ వారి ఆశలను అడియాశలు చేస్తూ విజయం సాధించాడు.
సోరెమడి యుద్ధానికి సంబంధించి పుంగనూరు దగ్గర గల చెదల్ల గ్రామంలో బాణులు ఒక వీరగల్లును ప్రతిష్ఠించి అందులో యుద్ధం గురించి వివరించారు. బాణ రాజ ప్రతినిధి మాధవరాజు, వేలాది మంది సైనికులు, గుర్రాలు యుద్ధంలో మరణించినట్టు చెదల్ల శాసనం చెబుతున్నది. అదేవిధంగా మదనపల్లి సమీపంలోని బసినికొండ వద్ద గల వైదుంబ రాజు-గండ త్రినేత్ర రాయించిన శాసనంలో సోరెమడి యుద్ధంలో తమ సామంతుడు మారువాక చనిపోయినట్టు పేర్కొన్నారని మైనా స్వామి తెలిపారు.
రాయచోటి దగ్గరలోని అరవీడు లో గల వైదుంబ శాసనం సోరెమడి యుద్ధం గురించి తెలుపుతున్నది. అయితే ఆ శాసనాల్లో యుద్ధం జరిగిన తేదీని వివరించలేదు. శాసనంలో తెలిపిన అంశాల ప్రకారం నాటి సోరెమడిని నేటి చోళెమర్రి గా గుర్తించినట్టు చరిత్రకారుడు ప్రకటించారు. కాగా మహేంద్ర నోలంబాధిరాజ కు చెందిన కంబదూరు మల్లికార్జున గుడి శాసనం సా.శ. 883 ప్రకారం మహేంద్ర రాజకు ‘మహాబలి కుల విధ్వంసన’ అనే బిరుదు వుoది. కంబదూరు శాసనాన్ని బట్టి ‘సోరెమడియుద్ధం’ సా.శ.883 లో జరిగి వుoటుందని భావించవచ్చని మైనా స్వామి పేర్కొన్నారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా