
ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు చంద్రమోహన్ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అలాగే ఆయన మధుమేహంతో కూడా బాధపడుతున్నారని సమాచారం.
గతకొంతకాలంగా డయాలసిస్ కూడా చేయించుకున్నారు. ఆయనకు శోభన్ బాబు, మురళీమోహన్ మంచి స్నేహితులు. రచయిత్రి జలంధరను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు మధుర మీనాక్షి, మాధవి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి కూడా డాక్టరే. ఆమె చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న చంద్రమోహన్ జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చంద్రమోహన్ ఏలూరులో బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి ఈయన చాలా దగ్గరి బంధువు. తమ్ముడి వరస అవుతారు.
1966లో ‘రంగుల రాట్నం’ సినిమా రంగంపై పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే, 1987లో ‘చందమామ రావే’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు. ‘అతనొక్కడే’ సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు.
ఇక 1978లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో నటనకు గానూ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
2005లో వచ్చిన ‘అతనొక్కడే’ సినిమాలో నటనకు గానూ సహాయ నటుడిగా నంది దక్కించుకున్నారు. మొత్తంగా దాదాపు 932 సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. వీటిలో 175 సినిమాలు ఆయన హీరోగా చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా ఐదు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్ర వేశారు.
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని చంద్రమోహన్ చాలా సార్లు చెప్పేవారు. మొదటి సినిమా విజయవంతమైన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని చంద్రమోహన్ ఆలోచించారట. కానీ, ఆ కళామ్మతల్లి ముద్దుబిడ్డగా ఇక్కడే కొనసాగారు. ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ వంటి ఎన్నో మరిచిపోలేని సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు.
ఒకప్పుడు హీరోయిన్లకు లక్కీ హీరో చంద్రమోహన్. కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద చంద్రమోహన్‌తోనే ఎక్కువ సినిమాలు చేశారు. కాగా, గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆక్సిజన్’ సినిమాలో చివరిగా చంద్రమోహన్ కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ చంద్రమోహన్ సినిమాలు చేశారు.
More Stories
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు
ఓ ముస్లిం యువతితో మాట్లాడిన హిందూ యువకుడిపై దాడి!
షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటిపై లైంగిక దాడి