
ఇజ్రాయెల్ కు గూఢచర్యం ఆరోపణలపై ఖతార్ లో గతేడాది అరెస్టు అయి, ఉరిశిక్షకు గురయిన భారత నౌకాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారుల వ్యవహారంపై భారత్ అప్పీల్ కు వెళ్ళింది. గత ఏడాది ఆగస్టులో అరెస్టయిన ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
గతంలో ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుపై తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని భారత ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే తాజాగా ఈ కేసు వివరాలు అందుబాటులో లేవని విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఎనిమిది మంది మాజీ నేవీ అధికారుల కుటుంబాలతో తాము టచ్ లో ఉన్నట్లు కూడా కేంద్రం తెలిపింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే వారి కుటుంబాల్ని ఢిల్లీలో కలిశారని వెల్లడించింది. తాము సాధ్యమైన అన్ని చట్టపరమైన, దౌత్య సహాయాన్ని అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.
అలాగే ఈ ఎనిమిది మందికి చివరిసారి ఈ మంగళవారం కాన్సులర్ యాక్సెస్ అందించినట్లు వెల్లడించారు. అటు ఈ ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. అరెస్టు అయినప్పుడు దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం వీరు పనిచేస్తున్నారని తెలిసింది.
దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. ఇటాలియన్ టెక్నాలజీ ఆధారంగా స్టెల్త్ సబ్‌మెరైన్‌లు, కొంతమంది నావికులు సున్నితమైన ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారు ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
More Stories
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!
రక్షణ మంత్రితో సిసిఎస్ అనిల్ చౌహన్ భేటీ!
తమిళనాడు మంత్రులు సెంథిల్, పొన్ముడి రాజీనామాలు