తెలంగాణాలో తమదే అధికారం అంటూ చెప్పుకొంటున్న కాంగ్రెస్ లో సీట్ల కేటాయింపు గందరగోళంకు దారితీస్తుంది. పార్టీతో, ప్రజలతో సంబంధం లేనివారికి టిపిసిసి నాయకులు సీట్లు అమ్ముకొంటున్నారంటూ గాంధీ భవన్ వద్దనే రచ్చ రచ్చ చేస్తున్నారు. పైగా, పూర్తి మెజారిటీ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో గెలిచినా ఎమ్యెల్యేలు ఎంతమంది పార్టీలో మిగులుతారో చెప్పలేమని సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ని అధిష్టానం మూడో జాబితాలో నీలం మధుకి ప్రకటించడంతో పటాన్ చెరు నిప్పుల కుంపటి లాగా మారింది. ఇక్కడి నుంచి పార్టీ టికెట్ ఆశించిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు, నియోజకవర్గం మొత్తం మీద ధర్నాలు, నిరసనలు చేపట్టారు. శ్రీనివాస్ గౌడ్ భార్య, అమీనాపూర్ కాంగ్రెస్ మునిసిపల్ కౌన్సిలర్ కాటా సుధారాణి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పైన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
రేవంత్, జగ్గారెడ్డి పటాన్ చెరు టికెట్ ను రూ. 100 కోట్లకు అమ్ముకున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. టికెట్ నీలం మధుకి ఇవ్వడానికి ఏమేమి తీసుకున్నారో, ఎక్కడో తీసుకున్నారో అన్ని కూడా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే మీడియా ద్వారా ప్రజలకు వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ముంబాయి, హైదరాబాద్ హైవే పైన రేవంత్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
పదిరోజుల కింద పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన ఒక గ్రామ సర్పంచ్ టికెట్ కి ఎలా టికెట్ ఇస్తారని ఆమె ప్రశ్నించారు. నీలం మధుకి పట్టుమని 2,000 ఓట్లు కూడా రావని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని దశాబ్దానికి పైగా కాటా శ్రీనివాస్ గౌడ్ కాపాడుకుంటూ వస్తున్నారని, తనకు తప్ప ఎవరికీ టికెట్ ఇచ్చినా తాము ఎట్టి పరిస్థితిలోనూ మద్దతు ఇవ్వబోమని, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల అనంతరం ప్రకటించారు.
దిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన నీలం మధు, కాంగ్రెస్ బి- ఫారం లేకుండానే పటాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థిగా మంగళవారం రోజునే తన నామినేషన్ దాఖలు చేశారు. గణేశా గడ్డ దగ్గర ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, తన అనుచరులతో పటాన్ చెరు వరకు ర్యాలీగా వచ్చిన మధు, తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ డి.దేవుజాకు సమర్పించారు.
అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరు కూడా మధుకి మద్దతుగా ర్యాలీలో, నామినేషన్ సమర్పించేటప్పుడు పాల్గొనలేదు. ఇదిలా ఉండగా కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కోసం ప్రయత్నిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర రాజా నరసింహ కూడా, రేవంత్ రెడ్డితో పాటు, ఏఐసీసీ పెద్దలతో పటాన్ చెరులో పార్టీ అభ్యర్థిని మార్చాలని కోరుతూ మంతనాలు జరుపుతున్నారు.
తెలంగాణాలో నామినేషన్ల దాఖలు చేయడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో, నియోజగకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో పూర్తి గందరగోళం నెలకొంది.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!