
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగే అవినీతి, కుంభకోణాలను ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2జీ స్కామ్, 3జీ స్కామ్ సహా పలు కుంభకోణాలకు ఎవరు పాల్పడ్డారనేది అందరికీ తెలుసని చెప్పారు.
బెయిల్‌పై ఉన్నవారంతా అవినీతి గురించి ఆరోపణలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా అది అవినీతిలో నిండా మునుగుతుందని చౌహాన్ ఆరోపించారు. రెండు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ సింగ్ పనిచేయగా ఆయన హయాంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
తాము పంటలకు కనీస మద్దతు ధరను ఏ మేరకు పెంచామనేది ప్రియాంక గాంధీకి తెలియదని ధ్వజమెత్తారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బైగా, భరియ, సహరియ వర్గాలకు చెందిన మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 1000 జమచేసే పధకాన్ని నిలిపివేసిందని ఆయన ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో తాము పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం లాడ్లి బహన యోజన కింద బాలికలకు రూ. 1250 అందిస్తున్నామని, దీన్ని నెలకు రూ. 3000కు పెంచే గ్యారంటీ తాము ప్రజలకు ఇస్తున్నామని చౌహాన్ స్పష్టం చేశారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు