తెలంగాణలో కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ మద్దతు

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) పార్టీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు తమ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేరళా ఎమ్మెల్యే పీకే కున్హాలకుట్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు లేఖ రాశారు.

తెలంగాణలో తమకు బలమైన పునాదులు ఉన్నాయని పీకే కున్హాలకుట్టి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేస్తామని పీకే కున్హాలకుట్టి తెలిపారు.  తెలంగాణలో ఇండియన్ ముస్లిం లీగ్ నేతలు, పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, హైదరాబాద్  కేంద్రంగా గల ముస్లిం పార్టీ ఎంఐఎం ఇప్పటికే అధికార బిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది.

తెలంగాణాలో పలు చిన్న చిన్న పార్టీలతో కూడా కాంగ్రెస్ పొత్తు ఏర్పర్చుకొంటున్నది. ఇప్పటివరకు సంప్రదింపులతో విసుగు చెందిన సిపిఎం కాంగ్రెస్ తో ఇక పొత్తుకు ఆస్కారం లేదంటూ 14 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే సీపీఐ మాత్రం కొత్తగూడెం సీటు తమకు వదిలేందుకు కాంగ్రెస్ ఒప్పుకోవడంతో పొత్తుకు సిద్ధపడింది. 

స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీపీఐ ఆఫీసుకు వెళ్లి.. కీలక నేతలు కూనంనేని సాంబ శివరావు, చాడ వెంకటరెడ్డిలతో చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెంతో పాటు  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం, వైఎస్ షర్మిలలు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వారిద్దరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించాలనే తాము కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతునట్లు వెల్లడించారు.