త్రిపుర గవర్నర్ నల్ల ఇంద్రసేనారెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో త్రిపుర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్ రాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ గవర్నర్ వ్యవస్థ విధులు, బాధ్యతలను గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సత్వర అమలుపై దృష్టి సారించాలని ఆమె గవర్నర్లను కోరారు. ముఖ్యంగా సాధారణ పౌరుల అవసరాలైన విద్య, ఆరోగ్యం, గృహావసరాలను పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అంతకు ముందు ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. త్రిపుర ప్రజల తరపున, వ్యక్తిగతంగా, ప్రతి భారతీయుడు ప్రపంచ వేదికపై తల ఎత్తుకుని దేశాన్ని నడిపించేలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధానికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, ప్రత్యేకంగా త్రిపురలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విధానాల వల్ల ప్రతి భారతీయుడికి ఈ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని గవర్నర్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో అభివృద్ధిలో వేగంగా అడుగులు వేసేందుకు త్రిపుర ప్రభుత్వానికి సహకరించే అవకాశాన్ని కల్పించినందుకు ప్రధానికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు గవర్నర్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షాలను కూడా కలుసుకుని, తన నియామకంపై కృతజ్ఞతలు తెలిపారు.

More Stories
భారత్ తటస్థంగా ఉండదు…శాంతికే మద్దతు
వికసిత్ భారత్ కు అవసరమైన ప్రతి సహకారం అందిస్తాం
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం