సోమవారం భాగ్యనగరానికి చేరుకుంటున్న అయోధ్య అక్షింతలు

సోమవారం భాగ్యనగరానికి చేరుకుంటున్న అయోధ్య అక్షింతలు
ఐదు శతాబ్దాల పోరాటాల ఫలితంగా అయోధ్య లోని శ్రీరామ జన్మభూమి లో భవ్య శ్రీరామ మందిరం నిర్మాణం జరుగుతుంది . ప్రధాన గర్భాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఒక్కొక్క ఘట్టం ఆవిష్కరణ జరుగుతుంది. అందులో భాగంగా ఈనెల 5న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆధ్వర్యంలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో శ్రీరామ అక్షతలు పూజా కార్యక్రమం జరుగుతుంది . 
 
పూజా కార్యక్రమం అనంతరం ఈ అక్షతలను ప్రతి రాష్ట్రం నుండి కార్యక్రమంలో పాల్గొనబోతున్న ఇద్దరు  ప్రతినిధులకు అందివ్వనున్నారు. తెలంగాణా నుండి డాక్టర్ రావినూతల శశిధర్,  శ్రీనివాస్ రావులు అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలో జరగనున్న అక్షత పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పూజిత అక్షతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ద్వార స్వీకరించిన తెలంగాణా రాష్ట్ర శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సమితి  ప్రతినిదులు సోమవారం ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్నారు. 
 
భాగ్యనగరానికి చేరుకుంటున్న శ్రీరామ అక్షతలకు పూజ్య స్వామిజీలు స్వాగతం పలికి శోభాయాత్రగా  ఎయిర్ పోర్టు నుండి బడంగ్‌పేట్, అల్మాస్ గూడ, మీర్ పేట్, జిల్లెలగూడలమీదుగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంకు చేరుకుంటారు.  శోభాయాత్రగా స్వాగతించిన అనంతరం స్వామిజీల సమక్షంలో దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జనవరి 1 నుండి 15 వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న జనజాగరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షతలు, శ్రీరాముని చిత్రపటం, ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి కుటుంబం నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలతో కూడిన నివేదన పత్రం అందించనున్నారు.

జనవరి 22న గర్భాలయంలో బాలరాముని విగ్రహా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించి శ్రీరామ అక్షతలు నెత్తిపై చల్లుకొని స్వామి వారి ఆశీర్వాదం పొందాలని, ఆరోజు రాత్రి ప్రతి ఇంటి ముందర 5 దీపాళు వెలిగించి పండుగ చేసుకోవాలని  శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పిలుపునిచ్చింది. సోమవారం భాగ్యనగరానికి చేరుతున్న శ్రీరామ అక్షతలకు స్వాగతం పలకడానికి నగరం సిద్ధమవుతుంది.