
తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు అభ్యర్థుల ఎంపికలోనే అంతర్గత కుమ్ములాటలతో చతికలపడి పోతున్న సమయంలో వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకొంటూ అడుగులు వేస్తున్న బిజెపిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎంపీ, ప్రస్తుత ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకరరెడ్డిపై జరిగిన దాడి అందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త అని స్పష్టంగా తెలిసిపోతున్నా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు నకిలీ ఫొటోలు, వీడియోలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరిన ఓ వ్యక్తి ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి అతడే ప్రభాకర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డట్టు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బృందం తొలుత విషప్రచారం చేసింది.
తర్వాత రాజు మెడలో గులాబీ కండువా ఉన్నట్టుగా ఓ ఫొటోను మార్ఫ్ చేసి అతడు బీఆర్‌ఎస్ కార్యకర్తే అని మోసగించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషప్రచారం బండారాన్ని సోషల్ మీడియా బట్టబయలు చేసింది. ఈ దాడికి పాల్పడింది మిరుదొడ్డి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గటాని రాజుగా పోలీసులు గుర్తించారు.
పైగా, అతను కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తేలింది. అయితే దాడితో తమ పార్టీకి, తమ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్‌రెడ్డి వాదిస్తున్నాడు. కానీ, గటాని రాజు తన సోషల్ మీడియా అకౌంట్ చూస్తే వాస్తవం వెల్లడవుతుంది. అందులో అతను కాంగ్రెస్‌కు మద్దతుగా అనేక పోస్ట్‌లు పెట్టాడు.
మెడలో కాంగ్రెస్ కండువాతో ఉన్నటువంటి ఫొటోను డీపీగా పెట్టుకున్నాడు. అంతే కాకుండా గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించాడు. ఇందుకు సంబంధించి ప్రచార రథంపై తాను మాట్లాడుతున్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
తన సోషల్ మీడియా అకౌంట్‌లో ‘జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్’ ట్యాగ్‌లైన్ రాసుకోవడం అతడు క్రియాశీల కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పేందుకు మరో ప్రధాన సాక్ష్యం. దాడి జరిగిన తర్వాత రాజు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తేనని సోషల్ మీడియా కోడై కూసింది.
కాగా, రేవంత్‌రెడ్డి కనీసం దాడిని ఖండించకుండా ఘటనకు రాజకీయ రంగు పులిమే కుటిల యత్నం చేశారు. ఈ ఘటనపై అంబర్‌పేట కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ సానుభూతి కోసం వాళ్ల అభ్యర్థిపై మొండి కత్తితో దాడి చేయించి దాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తున్నారంటూ నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారు.
పైగా తప్పుడు ఫొటోను పట్టుకొని ఆ అభ్యర్థి రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరాడంటూ ఆ వ్యక్తి తమ కార్యకర్త కాదు అని చెప్పేందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అయితే, కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాలో వైరల్ చేసిన వీడియోలోని వ్యక్తి స్వయంగా బయటకొచ్చి తాను రాజును కాదని, తన పేరు నర్సింహులని చెప్పాడు.
తాను ఆదివారం రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరానని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తానే ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశానంటూ ఆ ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలపడంతో కాంగ్రెస్ బండారం బయటపడింది.
దాడిని ఖండించిన రఘునందన్
కొత్త ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన కత్తి దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి తనకు మిత్రుడేనని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా, చట్టం తెలిసిన న్యాయవాదిగా, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎవరి మీద జరిగినా తాను ఖండిస్తానని రఘునందన్ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో దాడులు, హింసకు తావు లేదని పేర్కొంటూ ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు. కాగా, ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కొందరు కావాలనే పనిగట్టుకుని మీడియాల్లో, సామాజిక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నాలు చేస్తూ తన దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఇలాంటి ఘటనలు చేయటమేంటని సిద్దిపేట సీపీని రఘునందన్ ప్రశ్నించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు