కేరళ వరుస పేలుళ్లలో ఒకరు మృతి, 52 మందికి గాయాలు

* ఉగ్రవాద కోణంపై అనుమానం
కేరళలో వరుస పేలుళ్లు కలకలం సృష్టించాయి. కలమస్సెరి ప్రాంతంలోని ఓ కన్వెన్షన్​ సెంటర్​లో ఆదివారం ఉదయం కొన్ని క్షణాల వ్యవధిలో 3 పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 52 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కొచ్చికి ఈశాన్యంవైపు 10కి.మీల దూరంలో ఉన్న కలమస్సెరి అనే ప్రాంతంలోని యహోవా కన్వెన్షన్​ సెంటర్​ ఉంది. ఆదివారం ప్రార్థనలు మొదలైన కొంతసేపటికి పేలుళ్లు సంభవించాయి. “ప్రార్థనలు చేస్తుండగా.. పేలుడు శబ్దం వినిపించింది. కొంతసేపటికే మరో రెండు పేలుళ్లు జరిగాయి,” అని కన్వెన్షన్​ సెంటర్​ లోపల ఉన్న ఓ వృద్ధురాలు తెలిపింది. 

ప్రార్థనలకు 2000 మంది హాజరైనట్లు సమాచారం. పేలుళ్లకు గల కారణాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఘటనాస్థలానికి వెళ్లిన సహాయక సిబ్బంది ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన 36 మందిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరు అక్కడ చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కేరళ పేలుళ్ల ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని సీనియర్​ అధికారులు ఘటనాస్థలానికి వెళుతున్నట్టు తెలిపారు.

“ఈ రోజు ఉదయం 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో జామ్రా ఇంటర్నేషనల్​ కన్వెన్షన్​ అండ్​ ఎగ్జిబిషన్​ సెంటర్​లో పేలుడు సంభవించింది. కన్వెన్షన్​ సెంటర్​లో యహోవా విట్​నెస్​ రీజనల్​ ప్రోగ్రామ్​ జరుగుతోంది. ఈ నెల 27న అది మొదలైంది. ఈరోజే చివరి రోజు. 3 పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది. నేను ఘటనాస్థలానికి వెళుతున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఈరోజే ఒక టీమ్​ని ఏర్పాటు చేస్తున్నాము. 36 మంది గాయపడినట్టు తెలుస్తోంది,” అని డీజీపీ షేక్​ దర్వేశ్​ తెలిపారు.

వరపుజ, అంగమలి, ఎడపల్లి గ్రామాల నుంచి భక్తులు ప్రార్థన కోసం కాలామస్సేరి నెస్ట్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చారు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో హాలు మధ్యలో భారీ పేలుడు సంభవించిడంతో పాటు మరో రెండు మూడు పేలుళ్లు జరిగినట్టు సమాచారం. లొపలి వైపు నుంచి తాళం వేసి ఉండడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం ఆలస్యమైందని పోలీసులు వెల్లడించారు.

పేలుడు నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలందరు డ్యూటీలో చేరి, క్షతగాత్రులకు అన్ని విధాలుగా సాయం చేయాలని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఆదేశాలిచ్చారు​. పేలుళ్లు ఎలా జరిగాయి? అన్న విషయంపై ఎన్​ఐఏ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఏజెన్సీకి సంబంధించిన ఫోరెన్సీక్​ బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరిస్తోంది.

కేరళలో పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్​ ష పినరయి విజయన్​కు ఫోన్​ చేశారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఉగ్రవాదం కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ కేరళలో నిర్వహించిన ర్యాలీలో హమాస్ మాజీ కమాండర్ విర్చువల్‌గా పాల్గొనడం.. అది జరిగిన కొద్ది గంటల్లోనే క్రైస్తవుల ప్రార్థనా మందిరంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ర్యాలీకి.. ఈ పేలుళ్లకు సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.