
దేశానికి ఓబీసీ ప్రధానిని అందించింది, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసింది బిజెపియేనని, కానీ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని, మరొకరికి ఆ అవకాశం ఉండదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణాలో బీజేపీ గెలుపొందితే బీసీ సీఎం వస్తారని అమిత్ షా ప్రకటించడంతో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.
బిజెపి ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, బిజెపి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బిజెపి ఓ బి సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
పార్టీ అధ్యక్ష పదవుల్లోనూ కెసిఆర్ కుటుంబ సభ్యులే ఉంటారని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం 70 శాతం మందికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజేందర్ గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల బిఆర్ఎస్ ఇంచార్జులు కూడా కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని ఎద్దేవా చేశారు.
ఇతర వర్గానికి లేదా ఇతర కుటుంబాలకు ఎక్కడా అవకాశం దొరకదని విమర్శించారు. తెలంగాణ వస్తే బడుగులకు అధికారం, జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పారు కానీ కెసిఆర్ కుటుంబంలో మాత్రమే వచ్చిందని ధ్వజమెత్తారు. పదవులు వచ్చింది కూడా వారి కుటుంబానికే అని చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజల బతుకులు ఆగమయ్యాయని, రాజ్యాధికారంలో భాగం ఇస్తామని ఎస్సీలను మోసం చేశారని, బీసీల పట్ల చులకనభావంతో ఉన్నారని దుయ్యబట్టారు.
నరేంద్ర మోదీ మాట ఇస్తే తప్పరని పేర్కొంటూ తెలంగాణకు పసుపు బోర్డ్‌తో పాటు సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేసి నిలబెట్టుకున్న ఘనట బీజేపీది తెలిపారు. అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానాన్ని కూడా అమలు చేస్తారని రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ ఆ తర్వాత నాలుక మడతేసిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రస్తావించారు.
అటు దళితులకు మూడెకరాల భూమి వంటి, నిరుద్యోగ కాలండర్ ఇలా అన్ని విషయాల్లో కేసీఆర్ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ వంచించిన విషయాన్ని ప్రస్తావించారు. బడుగు, బలహీన వర్గాలను అధికారం రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఈటెల మండిపడ్డారు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను దారుణంగా మోసం చేశారని ఈ సందర్భంగా విమర్శించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలును మోసం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుంతుందని చెబుతూ బీసీలు అంటే కేసీఆర్‌కు చిన్న చూపుతోపాటు చులకనా భావం ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదని అంటూ తెలంగాణలో అణగారిన వర్గాలను కాంగ్రెస్ చిన్న చూపు చూసిందని ధ్వజమెత్తారు. తాజాగా ఇరు పార్టీలు బీసీల్లో ఎంత మంది నేతకు టికెట్ ఇచ్చారో చూశామని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం బీసీలకు 40 టికెట్ కేటాయించబోతుందని తెలిపారు. కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని కోరారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు