కాలం చెల్లిన కాంగ్రెస్ ను ప్రజలు 2014లోనే వదులుకున్నారు

2014తో ప్రజలు పనిచేయని పనికిరాని `కాలం చెల్లిన’ కాంగ్రెస్ ఫోన్‌ను వదుల్చుకున్నారని, సరికొత్త ఫోన్ల వంటి సర్కారును ఎంచుకున్నారని కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగాస్త్రాలు సంధించారు. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను శుక్రవారం ప్రారంభిస్తూ  2014ను తాను కేవలం క్యాలెండర్ మార్పిడి ప్రక్రియ అనుకోవడం లేదని, ఇది మహత్తర మార్పునకు దారితీసిన బద్లావ్ ఘట్టానికి ప్రతీక అని పేర్కొన్నారు. 

మొబైల్ ఫోన్ల విషయంలో దేశం సాధించిన అద్భుతమైన ప్రగతిని ప్రస్తావిస్తూ ఇంతకు ముందు మొబైల్ ఓ విలాసవంతమైన దిగుమతి సరుకుగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని, భారతదేశం ఇప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా మారిందని, ఇప్పుడు ఎగుమతిదారు అయిందని తెలిపారు.  అతి పెద్ద టెక్ కంపెనీలు యాపిల్ మొదలుకుని గూగుల్ వరకూ భారతదేశంలో తమ ఉత్పత్తి సంస్థల ప్రారంభానికి ముందుకు వస్తున్నాయని చెబుతూ అత్యంత వేగంగా 5 జి మొబైల్ టెలిఫోన్ సేవలను విస్తరించుకుని వెళ్లిన తరువాత ఇప్పుడు 6జిలో భారత్ ప్రపంచానికి టాప్‌గా నిలుస్తుందని చెప్పారు. 

ఇదంతా కూడా తమ ప్రభుత్వం ఈ రంగం ప్రగతికి తీసుకువచ్చిన పలు విధాలైన సాంకేతిక వెన్నుదన్నులతోనే సాధ్యం అయిందని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దేశంలో 5 జి టెక్నాలజీని తీసుకువచ్చారు. ఏడాదిలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రాతిపదికన 5 లక్షల 5 జి స్టేషన్లు ఏర్పాటు అయ్యాయని ప్రధాని వివరించారు.

యుపిఎ హయాంలో ఫోన్ల టెక్నాలజీ ప్రగతి కంటె ఎక్కువగా సంబంధిత కేటాయింపులలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని ధ్వజమెత్తారు. అప్పట్లో 2 జి టెలీకాం స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఎంత అవినీతి జరిగిందనేది అందరికి తెలిసిందేనని ప్రధాని గుర్తు చేశారు. 

కాగా తమ ప్రభుత్వ హయాంలో 4జిగా విస్తరణ జరిగింది. ఎక్కడా అవినీతి మరకలు లేవని చెబుతూ ఇక 6 జి టెక్నాలజీలో ఇండియా తిరుగులేని దశకుచేరుతుందని మోదీ తెలిపారు. కాంగ్రెస్ సారధ్య యుపిఎలో మనకు కాలం చెల్లిన ఫోన్లు, పగిలిన స్క్రీన్‌లు, సరిగ్గా పనిచేయని ఫోన్లు పట్టుకునే గతి ఉండేది. ఎన్ని సార్లు ఎన్ని బటన్లు నొక్కినా ఉలికేవి కావు పలికేవికావని చెప్పారు.

ఈ ఫోన్ల మాదిరిగానే అప్పటి ప్రభుత్వం కూడా పూర్తిగా నిరర్థక స్తంభిత పరిస్థితిలో ఉండేదని ఎద్దేవా చేశారు. రీస్టార్ట్‌లు, ఎంతగా ఛార్జింగ్‌లు చేసినా, బ్యాటరీలు మార్చినా అవి పనిచేయకుండా ఉండేవని పేర్కొన్నారు. ఇది పాత ప్రభుత్వానికి వర్తిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థలు వీరి హయాంలో పనిచేయని మొబైల్స్‌గానే మూల్గుతూ వచ్చాయని ధ్వజమెత్తారు. 

 ఇప్పుడు వచ్చిన మార్పు అనూహ్యం అని చెబుతూ ఇటీవలే గూగుల్ కంపెనీ వారు తమ అత్యాధునిక పిక్సెల్ ఫోన్లకు ఇండియాను ఉత్పత్తికేంద్రంగా ఎంచుకున్నారని ప్రధాని చెప్పారు. సామ్‌సంగ్ ఇప్పటికే తమ ఫోల్డ్ 5, యాపిల్ తమ ఐఫోన్ 15ను ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. సైబర్ సెక్యూరిటీకి అన్ని చర్యలూ చేపడుతున్నామని ప్రకటించారు.