నేడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నది. భారత్తో పాటు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల ప్రజలు చంద్ర గ్రహణాన్ని తిలకించవచ్చు. సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంటుంది. భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు.
భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది. చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణకాలంలో నేరుగా చంద్రుడిని చూడొచ్చు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 ని.ల వరకు ఉంటుంది.
ఈ చంద్ర గ్రహణం.. మొత్తం ఒక గంట 19 నిమిషాల పాటు ఉంటుందట. మేష రాశి, కర్కాటక, సింహరాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు ఇవాళ ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వారంతా శనివారం మధ్యాహ్నం 3.30 గంటల లోపుగా చేయాలని సూచించారు.
ఈ మూడు రాశులు, అశ్విని నక్షత్రం వారికి మినహాయిస్తే మిగతా తొమ్మిది రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు. చంద్ర గ్రహణం నేపథ్యంలో శ్రీకాళహస్తి తప్ప అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం, సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, బాసర అమ్మవారి ఆలయాలను మూసివేస్తారు.
తిరుమలలో 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని టిటిడి అధికారుల మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడంతో రాత్రి7.05 కు శ్రీవారం ఆలయం మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.15కు శ్రీవారి ఆలయం తెరువనున్నారు. గ్రహణం సందర్భంగా అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేయనున్నారు.

More Stories
కట్టమైసమ్మ దేవి ఆలయం సమీపంలో మలవిసర్జనతో ఉద్రిక్తత
సోమనాథ్ ఆలయం భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక
రాజా సాబ్ చిత్రం టికెట్ ధరల పెంపు జీవో కొట్టివేత