కరీంనగర్‌ కలెక్టర్‌, సీపీలపై బదిలీ వేటు

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలువురు సీనిర్ ఐపీఎస్ అధికారులు, కలెక్టర్లను బదిలీ చేయగా.. తాజాగా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ బి.గోపి, నగర పోలీస్‌ కమిషనర్‌ ఎల్‌.సుబ్బారాయుడులపై బదిలీ వేటు వేసింది. 
 
ఇద్దరు అధికారులనూ తక్షణం ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం లేఖ పంపింది. లేఖ అందిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరినీ బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. వారి తర్వాతి స్థానంలో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి తక్షణం సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల మూడో తేదీ నుంచి 3 రోజులపాటు విస్తృత స్థాయిలో సమీక్షలు నిర్వహించింది. ఈ నెల 9న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తరువాత రెండు రోజుల్లో 20 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 15 రోజుల వ్యవధిలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడటం అధికారుల్లో చర్చనీయాంశం అయింది. 
 
ఈ ఇద్దరూ సుమారు 3 నుంచి 10 నెలలలోపే బదిలీపై కరీంనగర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో పోలీసు కమిషనర్‌గా సుబ్బారాయుడు బాధ్యతలు చేపట్టగా, జులైలో కలెక్టర్‌గా గోపి బాధ్యతలు స్వీకరించారు.  అయితే వీరి బదిలీలపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  ప్రోటోకాల్‌తోపాటు ప్రతిపక్ష పార్టీల విషయంలో అధికారుల వ్యవహారశైలిపై గతంలో పలువురు నేతలు ఫిర్యాదులు చేశారని సమాచారం. ఇటీవల ఒక వర్గానికి సంబంధించిన ఊరేగింపు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు కూడా బదిలీలకు కారణమై ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
కరీంనగర్ నుంచి బీజేపీ తరపున బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ తరపున మంత్రి గుంగల పోటీలో ఉన్నారు.  కరీంనగర్ బీజేపీ నేతలు ఈసీఐకి ఇచ్చిన పిర్యాదులో భాగంగానే సీఎస్ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. గత కొద్దీ కాలంగా అధికార పార్టీకి చెందిన స్థానిక మంత్రికి సహకరిస్తున్నారని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు అందడంతోనే ఈసీ ఈ బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.