
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్ వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇన్నాళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన సూర్యాపేటలో జరిగిన బీజేపీ బహిరంగ సభ వేదిక ద్వారా స్పష్టం చేశారు.
వరుస చేరికలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జోరుమీదున్న బీజేపీలో సూర్యాపేటలో అమిత్ షా ప్రకటనతో మరింత హుషారు పెరిగింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న పార్టీలన్నింటికీ చెంపపెట్టుగా మారింది. ఇప్పటికే విడుదల చేసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు బిజెపి విశేష ప్రాధాన్యత కల్పించింది.
హిందూ ఓటర్లను కులాల లెక్కన విడదీసి మరోసారి బీసీల ఓటు బ్యాంకును వాడుకుని, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ వెనుకబడిన వర్గాలను గాలికి వదిలేయడమే వారి అలవాటు. అధికారంలో ఉన్నన్ని రోజులూ భారత సమాజాన్ని విడదీసి చూస్తూ, కలహాలు పెడుతూ సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది.
మరోవైపు, నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీసీల సంక్షేమానికి వివిధ పథకాలను తీసుకురావడంతోపాటుగా వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ, ఆయా వర్గాల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి బీసీల సంపూర్ణ సాధికారతకోసం పనిచేస్తోంది.
సమాజాన్ని ఏకీకృతం చేయడం బీజేపీ సిద్ధాంతమైతే ‘డివైడ్ అండ్ రూల్’ చేసి రాజకీయ లబ్ధి పొందడం కాంగ్రెస్ క్రూరమైన ఆలోచన. సూర్యాపేట బహిరంగ సభ వేదిక ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వాగ్దానాలలోని అనైతికతను, మోసాన్ని దేశప్రజలందరికీ ఎత్తిచూపేందుకు ఉద్దేశించిన ఓ వ్యూహం.
జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యతను కల్పించాలనేది బీజేపీ అంకిత భావానికి నిదర్శనం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ప్రజలందరి ముందున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఒక మచ్చుతునక. 27 బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీలు మోదీ కేబినెట్లో ఉన్నారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ ఇంత పెద్ద స్థాయిలో బీసీలకు, దళితులకు కేంద్ర మంత్రిత్వ శాఖలో స్థానం లభించలేదు.
22 అక్టోబర్ నాడు, బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన 52 ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితాలోనూ 38 జనరల్ కేటగిరీ స్థానాల్లో 20 మంది బీసీలను బరిలోకి దించింది. అంటే తొలిజాబితాలోని 52 సీట్లలో 52శాతం బీసీలకే కేటాయించింది. మిగిలిన వాటిలో 14 సీట్లను (నియోజకవర్గాల పునర్విభజన నిబంధనల ఆధారంగా) దళితులకు, గిరిజనులకు కేటాయించింది.
ప్రకటనలు చేయడం మాత్రమే కాదు, వాటిని అమల్లో చేసిచూపించే ఏకైక పార్టీ బీజేపీయే. రాజకీయ, ఆర్థిక పురోగతి, సాధికారత, రాజ్యాధికారం వంటి అంశాల్లో బీసీలకు, ఇతర వెనుకబడిన వర్గాలకు సరైన గౌరవం దక్కేది.. బీజేపీ పాలనలోనే అనే అభిప్రాయం బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
More Stories
వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో భారీ ప్రదర్శన
ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్ట్ ల విజయం
యునెస్కో జాబితాలో తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు