పాకిస్థాన్ పై అప్ఘ‌న్ సంచ‌ల‌న విజ‌యం

పాకిస్థాన్ కు అఫ్గానిస్థాన్‌ షాకిచ్చింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు చిత్తు చేసిన ఆ జట్టు ఇప్పుడు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. పాకిస్థాన్‌కిది హ్యాట్రిక్ ఓటమి. 
 
ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఉన్న పాక్‌ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది.  లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఇబ్రహీం జాద్రాన్‌ (74; 87 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. 
 
వీరిద్దరూ మొదటి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వచ్చిన రహ్మత్‌ షా (77; 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హష్మాతుల్లా షాహిది (48*; 45 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా ఆడి అఫ్గాన్‌కు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
 
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. చివరి ఓవర్ లో పాక్ ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ వికెట్లు కోల్పోయింది.  అంతకుముందు కెప్టెన్ బాబర్ ఆజం సహా ఐదు వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడ్డ జట్టు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను షాదాబ్ ఖాన్ 35, ఇఫ్తికార్ అహ్మద్ 32 చేపట్టారు.

పాక్‌ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ అజామ్ (74; 92 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ (58; 75 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. 

 చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (40; 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌ నిలకడగా ఆడగా, ఇఫ్తికార్ అహ్మద్‌ (40; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీకి ఒక్కో వికెట్ దక్కింది. ఇప్పటికే ఇంగ్లాండ్ ను ఓటించి అఫ్గానిస్థాన్ మంచి ఫామ్ లోఉంది. పాక్ పై విజయంతో పాయింట్ల పట్టికల్లో అప్థానిస్థాన్ 6వ స్థానానికి చేరింది.