ప్రజా వ్యతిరేకతలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజా వ్యతిరేకతలో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం

ఐదు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో నాలుగైదు నెలలవుతున్నా వాటిని అమలు చేయలేక సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఎన్నికల సమయంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. 

2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్‌సింగ్‌ నియోజకవర్గం రాజ్‌నంద్‌గావ్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ పాల్గొని ‘జన్‌ గోష్నా పత్రా (ప్రజా మ్యానిఫెస్టో)’ పేరిట ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. అయితే, ఐదేండ్లు గడిచినప్పటికీ, మ్యానిఫెస్టోలోని ప్రధాన హామీలను ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదు. 

దీంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పార్టీకి మళ్లీ ఎలా ఓటేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలను  ప్రజలు నిలదీస్తున్నారు. ఓట్లు అడిగేందుకు రావద్దంటూ కోర్బా జిల్లాలోని రామ్‌పూర్‌ నియోజకవర్గంలో ఏకంగా బ్యానర్లను ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజేశారు.

‘రాజీవ్‌ మిత్ర యోజన’ కింద రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెల నెలా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు  ఐదేండ్లయినా ఆ సోయి లేకుండాపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హఠాత్తుగా ఇటీవల ఈ విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది.  లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి నిబంధనల పేరిట కొత్త కొర్రీలు పెట్టింది. 

కుటుంబ సంవత్సరాదాయం రెండున్నర లక్షలు దాటని యువతకు మాత్రమే ఈ భృతిని పరిమితం చేసింది. వాస్తవానికి 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ. 2,500 చొప్పున భృతి కావాలంటే సుమారు. రూ. 3 వేల కోట్లు ప్రతి ఏటా బడ్జెట్‌లో కేటాయించాలి. కొత్త నిబంధనలను తీసుకొచ్చి బడ్జెట్‌లో రూ. 250 కోట్లు మాత్రమే కేటాయించింది. భృతి విషయమై సర్వత్రా నిరసనలు వ్యక్తమవ్వడంతో మూడు విడుతల్లో 1,16,737 మందికి రెండునెలలు భృతి చెల్లించినట్టు సమాచారం.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లను ఇస్తామని ప్రకటించిన సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో 91 ప్యూన్‌ పోస్టుల కోసం పరీక్షను నిర్వహించాలనుకొంటే ఏకంగా 2.25 లక్షల దరఖాస్తులు రావడం, అభ్యర్థుల్లో పీజీ, పీహెచ్‌డీ, ఇంజినీర్లు కూడా ఉండటం రాష్ట్రంలోని నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్నది.

అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని మ్యానిపెస్టోలో కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ఓ దశలో సీఎం బఘేల్‌ అప్పటి బీజేపీ ప్రభుత్వానికి మద్యనిషేధం అమలు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సూచించడం లేదని ధ్వజమెత్తారు కూడా. 

అయితే అధికారంలోకి రాగానే సీఎం సహా కాంగ్రెస్‌ నేతలంతా ఆ విషయం మరచిపోయి  ప్రభుత్వ ఆదాయం పెంపు మీదనే దృష్టి పెట్టారు.  కరోనా లాక్‌డౌన్‌లోనూ మద్యం ద్వారా ఆదాయం కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దానికితోడు కరోనా చార్జీ పేరుతో లిక్కర్‌పై పన్నును వేసింది.

అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. చరియాదంఢ్‌ గ్రామంలో రుణమాఫీపై ప్రభుత్వానికి తన బలిదానం కనువిప్పు కావాలని ఓ రైతు ఆత్మహత్యను వీడియో తీయడం రాష్ర్టాన్ని అట్టుడికించింది. 

35 లక్షల మంది రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన ప్రభుత్వం రైతులకు శూన్యహస్తం చూపిందంచిందని విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలోని 13.46 లక్షల మంది రైతులు సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ. 5,260 కోట్ల విలువ చేసే స్వల్పకాలిక రుణాలన్నీ చెల్లించామని సర్కారు చెప్పుకొచ్చింది. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు, రాష్ట్ర గ్రామీణ బ్యాంకులు ఇచ్చిన రుణాలను కూడా చెల్లిస్తున్నామని తెలిపింది. అయితే, అలా చేయలేదు.