పాలస్తీనియన్లకు భారత్‌ మానవతా సాయం

పాలస్తీనియన్లకు భారత్‌ మానవతా సాయం
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు మానవతా సహాయం అందించేందుకు భారత్‌ సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.  ప్రాణాధార ఔషధాలు, సర్జికల్‌ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్‌ బెడ్స్‌, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్‌, వాటర్‌ ప్యూరిఫికేషన్‌ ట్యాబ్లెట్లు, ఇతర అత్యవసర వస్తువులతో కూడిన ఐఏఎఫ్‌ సీ-17 విమానం ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి ఈజిప్ట్‌లోని ఈఐ-ఆరిశ్‌ ఎయిర్‌పోర్టుకు బయల్దేరింది. 
 
మానవతా సయాంలో భాగంగా వీటిని పంపిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.  భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్‌ సీ-17 విమానంలో మొత్తం 6.5 టన్నుల సామాగ్రి వెళ్తున్నదని చెప్పారు.  ఇది తొలుత ఈజిప్టులోని ఈఎల్‌-అరిష్‌ విమానాశ్రయానికి, అక్కడి నుంచి రఫా సరిహద్దు మీదుగా గాజాకు తీసుకెళ్తారని వెల్లడించారు.

కాగా, ఇజ్రాయెల్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజాకు ఊరట కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు వారం రోజులకు పైగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గాజా వాసుల కోసం సహాయ సామగ్రిని తీసుకొచ్చిన ట్రక్కులను ఇజ్రాయెల్‌ అనుమతించింది.  దాంతో యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత గాజా తలుపులు తెరుచుకున్నాయి.

ఆహారం, నీరు, ఇంధన కొరతతో అల్లాడుతున్న గాజా ప్రజల కోసం రఫా బార్డర్‌ పాయింట్‌ను ఈజిప్టు తెరిచింది. దాంతో నిత్యావసరాలు, మందులతో కూడిన మానవతా సాయంతో వచ్చిన ట్రక్కులు బార్డర్‌ దాటాయి.  ఇరవై ట్రక్కులు గాజాలోకి ప్రవేశిస్తున్న  వీడియోలను ఈజిప్ట్ ప్రభుత్వం టీవీలో ప్రసారం చేసింది. గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ అధీనంలో లేని ఏకైక దారి రఫా మాత్రమే. ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న ఈ దారి నుంచి ట్రక్కులు వచ్చేందుకు తొలుత ఇజ్రాయెల్ అంగీకరించలేదు.

దాంతో కొన్ని రోజులుగా మానవతా సాయాన్ని తీసుకొస్తున్న కార్గో విమానాలు, ట్రక్కులు రఫా సరిహద్దు వద్దే ఆగిపోయాయి. అమెరికా విజ్ఞప్తి నేపథ్యంలో కేవలం 20 ట్రక్కుల ప్రవేశానికి ఇజ్రాయెల్​ అంగీకరించింది. గాజాలో ప్రవేశించిన 20 ట్రక్కుల్లోని సామగ్రిని చిన్న చిన్న మోటార్లపై అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

కాగా, వందలాది ట్రక్కు లు సహాయ సామగ్రితో వారం రోజులకుపైగా ఈజిప్టు సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నాయి. అందులో 20 ట్రక్కులను ఇప్పుడు లోపలికి అనుమతించారు. దాంతో గాజా వాసులకు స్వల్ప ఊరట లభించింది. ఇప్పటిదాకా తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక సుమారు 23 లక్షల మంది గాజావాసులు అల్లాడుతున్నారు.