ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కి దూరం అఖిలేష్

కేంద్రంలో బిజెపిని గద్దె దింపడమే లక్షంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో ఎదురుగాలి తగిలే అవకాశాలు కనిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై కూటమి భాగస్వామి అయిన సమాజ్‌వాది పార్టీ మండి పడుతోంది. 
 
కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెన్నుపోటుగా అభివర్ణించిన ఎస్‌పి అధినేత, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రాబోయే లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీపట్ల తాము కూడా అదేవిధంగా వ్యవహరిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. పైగా, ఇండియా కూటమిలో కొనసాగే విషయంపై పునరాలోచన చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. దానితో ఈ కూటమి బీటలు వారిన్నట్లు స్పష్టం అవుతుంది.
 
గత మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఈ పోస్ట్‌లో ఆయన తిరిగి పీడీఏ ప్రస్తావన చేశారు. ‘ఇండియా’ కూటమి ఊసెత్తలేదు. పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళిత్, మైనారిటీలు అని అర్ధం.

ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సమాజ్‌వాదీ పార్టీకి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 6 సీట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పిన కాంగ్రెస్ తమకు మొండిచేయి చూపించిందంటూ అఖిలేష్ యాదవ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. 18 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇరుపార్టీల అభ్యర్థులు పోటీపడుతున్నారు.

ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ ఆదివారంనాడు ఒక ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త ఒకరి వీపుపై పార్టీ రంగు ఎరువు, ఆకపచ్చ రంగుతో పాటు ఒక సందేశం కూడా ఉంది. 

”మిషన్ 2024. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) ఇప్పటికీ చిరంజీవే. పీడీఏ ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు విజయాన్ని చేకూర్చిపెడుతుంది. పేద ప్రజలకు న్యాయం జరిగేలా అఖిలేష్ యాదవ్ చూస్తారు” అని ఆ సందేశంలో ఉంది. పీడీఏ రివల్యూషన్‌గా 2024 ఎన్నికలు ఉండబోతున్నాయని అఖిలేష్ తన సందేశంలో పేర్కొన్నారు.

అఖిలేష్ వాఖ్యలలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత జఠిలం చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. ‘లీవ్ దిస్ అఖిలేష్ వఖిలేష్’ అంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఇండియా బ్లాక్ అనేది కేంద్ర స్థాయిలోని విషయమని, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలన్నదే ఆ కూటమి ఉద్దేశమని చెప్పారు. 
 
దీనిపై అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన ఇలాగే ఉంటే, వారితో ఎవరు ఉంటారు? అని ఆయన ప్రశ్నించారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిపై కూడా ఆయన సందేహించారు. కులగణన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.  ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో కులగణాంకాలను ఇవ్వలేదని, వెనుకబడిన తరగతులు, గిరిజనుల మద్దతు లేకుండా గెలవలేమనే విషయం ఇప్పుడు అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. ఆ తరగుతులు ఏవీ కాంగ్రెస్ వెనుక లేవనే విషయం కూడా వారికి బాగా తెలుసునంటూ తూర్పారబట్టారు.