ఆస్కార్‌ కమిటీ సభ్యుడిగా ఎన్టీఆర్‌

ఆస్కార్‌ కమిటీ సభ్యుడిగా ఎన్టీఆర్‌
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దేశానికి తొలి ఆస్కార్‌ను అందించిన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్‌ స్టార్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా, తాజాగా ఆస్కార్‌ కమిటీ ఎన్టీఆర్‌కు ఓ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ కమిటీలోని నటుల కేటగిరీలోకి ఎన్టీఆర్‌ను చేర్చింది.  అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్‌ పేరును అధికారికంగా ప్రకటించింది. ‘డెడికేషన్  కలిగిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను ‘యాక్టర్స్‌ బ్రాంచ్‌’లోకి ఆహ్వానిస్తున్నాం’ అని అకాడమీ ఇనస్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది. 

తారక్‌తోపాటు మరో నలుగురు హాలీవుడ్‌ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ను కొత్త అకాడమీ మెంబర్‌గా పరిచయం చేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సమయంలోని విజువల్స్‌ను షేర్‌ చేసింది.  ప్రస్తుతం అకాడమీ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రౌడ్‌ మూమెంట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్‌కు అభినందనలు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఏడాది ఆస్కార్‌ కమిటీ 398 మందికి కొత్తగా ఆస్కార్‌ ప్యానెల్‌లో చోటు కల్పించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌ నుంచి పదకొండు మంది సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.  వీరిలోటాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌, ఛాయాగ్రాహకుడు సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌లకు ఆహ్వానాలు అందాయి.

వీరితోపాటు ప్రముఖ దర్శకులు మణిరత్నం, కరణ్‌జోహార్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌, చైతన్య తమహానే, షానెక్‌ సేన్‌లు కూడా ఆస్కార్‌ కమిటీ నుంచి ఆహ్వానాల్ని అందుకున్నారు.  వారిలో భారత్‌ నుంచి ఎన్టీఆర్‌ను కమిటీ సభ్యుడిగా ఆస్కార్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆస్కార్‌ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్‌ ఖ్యాతి దక్కించుకున్నారు.  ఇక కొత్తగా ఆస్కార్‌ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న వారందరికీ రాబోవు ఆస్కార్‌ అవార్డుల ఎంపికలో ఓటు హక్కు ఉంటుంది.

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’  చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టింది.  ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. అంతేకాదు, భారతీయ సినిమా ఖ్యాతిని ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.