స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేదు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించే అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై భిన్నాభిప్రాయలున్నాయన్న సీజేఐ చంద్రచూడ్ వారి వివాహానికి చట్టబద్దత కల్పించలేమని స్పష్టం చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై నేడు తీర్పు వెలువరించింది. 
 
స్వలింగ సంపర్క వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. వారిని దంపతులుగా గుర్తించలేమని పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తుది తీర్పు ఇచ్చింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.  
 
స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని, వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని స్పష్టం చేసింది. కలిసి జీవించడం గుర్తిస్తున్నాం..కానీ దాన్ని వివాహంగా పరిగణించలేమని న్యాయస్థానం వెల్లడించింది. స్వలింగ సంపర్కులను దంపతులుగా గుర్తించలేమని, ఆ జంటల అభ్యర్ధనల పట్ల సానుభూతి ఉంది కాని అభ్యర్ధనలకు చట్ట బద్ధత లేదని పేర్కొంది.

‘స్వలింగ సంపర్కం లేదా హోమో సెక్సువాలిటీ అనేది పట్టణ భావన కాదు లేదా సమాజంలోని ఉన్నత వర్గాలకే పరిమితం కాదు. ఇటువంటి వ్యక్తులు కేవలం పట్టణాల్లోని ఉన్నత వర్గాల ప్రదేశాలలో మాత్రమే ఉన్నారని చిత్రీకరించడం భావ్యం’ అని పేర్కొంది.
 
కోర్టులు చట్టాలను చేయలేవని, కేవలం న్యాయసమీక్ష మాత్రమే చేయగలవని తెలిపింది. ప్రత్యేక వివాహ చట్టంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ‘ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయాలా? వద్దా? అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది.. ఈ న్యాయస్థానం చట్టబద్ధమైన అంశంలో జోక్యం చేసుకోదు.. కానీ, వివాహం స్థిరమైన, మార్పులేని వ్యవస్థ అని చెప్పడం సరికాదు’ అని అభిప్రాయపడింది.
 
‘ఒకరిపై ఒకరికి ప్రేమ, అనుబంధాన్ని వ్యక్తం చేసే సామర్థ్యం మనల్ని మనుషులుగా భావించేలా చేస్తుంది. కేవలం శారీరకంగానే కాకుండా భావోద్వేగాలను పంచుకోవాల్సిన అవసరం ఇటువంటి సంబంధాలు జన్మతహ కుటుంబాలు, శృంగార సంబంధాలు మొదలైనవి కుటుంబంలో భాగంగా ఉండాల్సిన అవసరం మానవ లక్షణాల్లో ప్రధానమైంది. ఇది స్వీయ అభివృద్ధికి ముఖ్యం’ అని వ్యాఖ్యానించింది.

జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది ఒకరి జీవిత గమనాన్ని ఎంచుకోవడంలో అంతర్భాగం. కొందరు దీనిని తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా భావిస్తారు. ఇది ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ మూలాల్లోకి వెళుతుందని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ విరుద్దం కాదని, దీనిపై ఓ కమిటీని వేయాలని కేంద్రానికి సూచించింది.

‘బంధంలోకి ప్రవేశించే హక్కులో ఒకరి భాగస్వామిని ఎంచుకునే హక్కు, దానిని గుర్తించే హక్కు ఉంటుంది. అటువంటి బంధాలను గుర్తించడంలో వైఫలమైతే స్వలింగ జంటల పట్ల వివక్షకు దారి తీస్తుంది. ప్రత్యి వ్యక్తికీ వారి జీవితాల నైతిక నాణ్యతను నిర్ధారించే హక్కు ఉంది. స్వేచ్ఛకు అర్థం తమకు నచ్చినట్టు ఉండగల సామర్థ్యం.. స్వలింగ వ్యక్తులపై వివక్ష చూపలేమని ఈ కోర్టు గుర్తించింది. చట్ట ప్రయోజనాలు,సేవలు భిన్న లింగ జంటలకు కల్పించడ, స్వలింగ జంటలకు నిరాకరించడం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుంది’ అని తెలిపింది.

 
అలాగే ఈ కేసుపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అయితే అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్వలింగ వివాహాల చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై గత మే 11న పూర్తిచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. ధర్మాసనంలోని న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. స్వలింగ వివాహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.