కర్ణాటక నోట్లు తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ కట్టలే

కర్ణాటక నోట్లు తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ కట్టలే
కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడులలో ఇప్పటికి మొత్తంగా రూ.102 కోట్లు పట్టుబడితే అందులో రూ.94 కోట్ల నగదు, రూ.8 కోట్ల ఆభరణాలు ఉన్నాయని ఐటీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పట్టుబడ్డ నగదులో ఒక్క బెంగళూరులోనే రూ.87 కోట్లు పట్టుబడటం గమనార్హం. 
 
ఈ నిధులన్నీ తెలంగాణ ఎన్నికల కోసం కర్ణాటక ప్రభుత్వంలోని కీలక నేతలు సేకరించినవే అనే ఆరోపణలు వెలువడుతున్నాయి.  కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మూడు రాష్ర్టాల్లో మూడు రోజులుగా కాంట్రాక్టర్లు, బిల్డర్ల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు పట్టుబడిన విషయం తెలిసిందే. 
 
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు నిధులు సమీకరించే బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వానికి అప్పగించడంతో ప్రభుత్వంలోని ఇద్దరు కీలక నేతలు బాధ్యతలు పంచుకొని కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరిస్తున్నట్లు  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇక్కడ పట్టుబడిన డబ్బు ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు తరలించడానికి సమీకరించినట్టు సమాచారం ఉందని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించడమే కాకుండా దీనిపై ఈడీ విచారణ జరిపితే అసలు దోషులు బయటకు వస్తారని స్పష్టం చేశారు.
 
పట్టుబడిన డబ్బులు ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు తరలించడానికి కాంగ్రెస్‌ సమీకరించినవేనని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆరోపించగా, మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరో అడుగు ముందుకేసి ఆ డబ్బు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సమీకరించినవేనని ఆరోపించడం గమనార్హం. 
కాగా ఈ ఆరోపణలను డీకే శివకుమార్‌ ఖండిస్తూ ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.
అయితే ‘రాజకీయ ప్రేరేపితమని డీకే శివకుమార్‌ బుకాయించడం కాదు…పట్టుబడిన డబ్బులు మీవో? కావో? చెప్పాలి’ అని కుమారస్వామి డిమాండ్‌ చేసారు. ‘శివకుమార్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తమ శాఖను తెరిచిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్ర ఆరోపణ చేశారు. కర్ణాటకలో శివకుమార్‌ డబ్బులు వసూలు చేసి ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘అక్కడెక్కడో డబ్బులు పట్టుబడితే తమకేమి సంబంధం’ అని బుకాయించడం పట్ల కర్ణాటకలోని  విపక్ష నేతలు విస్తుపోతున్నారు. తెలంగాణ ఎన్నికలతో డీకే శివకుమార్‌కు సంబంధం లేకుంటే అక్కడి నుంచి టిక్కెట్లు ఆశించే నాయకులు, తన పార్టీ విలీనం కోసం వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డీకేతో ఎందుకు భేటీ అయ్యారని వారు ప్రశ్నిస్తున్నారు. 

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు ఎందుకు తరలించినట్టు అని ప్రశ్నిస్తున్నారు. పైగా తెలంగాణలో అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యాక తన మకాం హైదరాబాద్‌లోనే అని ఆయన స్వయంగా పార్టీ నేతలకు చెప్పింది వాస్తవం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఇలా ఉండగా కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్లు, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కాంతరాజ్‌కు సన్నిహితుడైన బిల్డర్‌ సంతోష్‌ ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా వీరంతా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితులని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నారు.

కర్ణాటకలో గత బీజేపీ సర్కార్‌ 40 శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నదని పెద్దయెత్తున ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో తమ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని కాంట్రాక్టర్లు, అధికారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. 

బెంగళూరు నగరపాలికలో పెండింగ్‌లో ఉన్న సుమారు రెండు వేల కోట్ల రూపాయాల బిల్లులను క్లియర్‌ చేయడానికి సంబంధిత మంత్రి అయిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ 15 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏకంగా రాష్ట్ర గవర్నర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తమకు నెలనెలా కప్పం చెల్లించాలని వేధిస్తున్నారని వ్యవసాయశాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై గవర్నర్‌ విచారణకు ఆదేశించడం జరిగింది. అధికారులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు టార్గెట్‌ పెట్టి పెద్ద మొత్తంలో కర్ణాటక ప్రభుత్వం సమీకరించిన నిధులు కాంగ్రెస్‌ పార్టీకి ఖజానాగా మారాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.