రేవంత్ రెడ్డికి ఫోన్‌ పే.. పోస్టర్ల కలకలం

ఒకవంక కాంగ్రెస్ 55 మంది అభ్యర్థులతో తెలంగాణ ఎన్నికలకు ఆదివారం మొదటి జాబితాను విడుదల చేయగా, మరోవంక అభ్యర్థుల ఎంపికలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యంగా పోస్టర్లు వెలువడటం  కలకలం రేపుతోంది.
 
ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు తీసుకుని టికెట్లను కేటాయించారని ఆరోపిస్తూ పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే డిజైన్‌లో పోస్టర్లను అతికించారు. వీటిని ఎవరు అతికించారనేది తెలియ రావట్లేదు. తొలి జాబితా విడుదలైన కొద్దిసేపటికే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీ సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గండ్ర సత్యనారాయణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీలిమా రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వంటి సీనియర్లు తొలి జాబితాలో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం, జూపల్లి కృష్ణారావుకు తొలి జాబితాలో చోటు దక్కింది.
 
పార్టీలో ఒక కుటుంభంలో ఒకే సీట్ ఇవ్వాలనే ఉదయపూర్ డిక్లరేషన్ కు తిలోదకాలిస్తూ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య పద్మావతికి కూడా సీటు ఇచ్చారు. అదే విధంగా ఇటీవల పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్యెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కొడుకు రోహిత్ మెదక్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
 
భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది. నాగార్జునసాగర్ బరిలో ఈసారి జానారెడ్డి బదులు ఆయన తనయుడు జయవీర్ బరిలో ఉండనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి, ఎంపీ కోమటిరెడ్డి నల్గొండ నుంచి, భట్టి విక్కమార్క మధిర నుంచి పోటీ చేయనున్నారు. 
 
గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై తూమకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.