ఎన్నికల నిధులకు ఏటీఎంగా కర్ణాటక

ఎన్నికల నిధులకు ఏటీఎంగా కర్ణాటక

కాంగ్రెస్‌ నేత, కాంట్రాక్టర్‌ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్ల అక్రమ సొమ్ము బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. తెలంగాణతో పాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి సొమ్మును సిద్ధంచేశారని సిద్దరామయ్య సర్కారుపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శల జడివాన కురిపిస్తున్నారు.

బీజేపీ నేత, మాజీమంత్రి సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ రూ.42 కోట్ల డబ్బును కాంగ్రెస్‌ ఏజెంట్లు అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల నిధులకు కర్ణాటకను కాంగ్రెస్‌ ఓ ఏటీఎంగా మార్చివేసిందని మండిపడ్డారు. ఐదు గ్యారెంటీలను అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ 4 నెలలు గడిచినా ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు.

కాగా, తెలంగాణలో పంచేందుకే రూ. 42 కోట్ల అక్రమసొమ్మును కాంగ్రెస్‌ సిద్ధం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. పార్టీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌హయాంలో అక్రమ లావాదేవీలు పెరిగిపోయాయని బీజేపీ నేత నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలో వేళ్లూనుకొని ఉందని కేంద్రమంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌ ఆరోపించారు. 5 రాష్ర్టాల ఎన్నికల్లో డబ్బును పంచడానికి కాంగ్రెస్‌ కర్ణాటకను ఏటీఎంలా వాడుకుంటున్నదని ఆరోపించారు.