ఇజ్రాయెల్ నుంచి 235 మందితో ఢిల్లీ చేరిన రెండో విమానం

ఇజ్రాయెల్ నుంచి 235 మందితో ఢిల్లీ చేరిన రెండో విమానం
ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం రోజురోజుకు తీవ్రతరమవుతున్నది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది. దీనికోసం ఆపరేషన్‌ అజయ్‌ కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి మొదటి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. 
తాజాగా మరో విమానం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున వందేమాతరం నినాదాలు చేశారు. ఈ నెల 6న పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై దాడులకు దిగారు. 20 నిమిషాల్లో 5 వేలకుపైగా రాకెట్లతో హమాస్‌ విరుచుకుపడింది. 
 
ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్‌ను నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నది. దీంతో ఇరువైపుల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తరలిస్తున్నది.
 
కాగా, ఇజ్రాయెల్‌లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపిన 21 మంది తమిళ విద్యార్థులు సురక్షితంగా స్వస్థలాలకు మొదటి విమానంలో చేరారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన 21 మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అక్కడి తమిళనాడు హౌస్‌కు తరలించారు. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు విమానాల్లో స్వస్థలానికి పయనమయ్యారు. 
 
15 మంది విద్యార్థులు బయలుదేరిన విమానం చెన్నై విమానాశ్రయానికి చేరగా, విమానాశ్రయం వద్ద ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఎంపీ కళానిధి వీరాస్వామి విద్యార్థులకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్లలో విద్యార్థులు వారి నివాసగృహాలకు పయనమయ్యారు.