
ఇజ్రాయిల్- హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ‘ఆపరేషన్ అజయ్’ చేపట్టినట్టు తెలిపింది. ఇజ్రాయేల్‌లో మొత్తం 18,000 మంది భారతీయులు ఉండగా, వీరిని తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
విదేశాలలో ఉన్న భారతీయుల భద్రత, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక చార్టర్డ్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. స్వదేశానికి వచ్చేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని, వారిని తీసుకొచ్చేందుకు తొలి ప్రత్యేక విమానం గురువారం అందుబాటులో ఉంటుందని ఇజ్రాయేల్‌లోని భారత రాయబార కార్యాలయం మరొక పోస్ట్‌లో తెలిపింది.
‘ప్రత్యేక విమానం కోసం నమోదు చేసుకున్న భారతీయ పౌరులు చాలా మందికి ఇ-మెయిల్ పంపాం. తదుపరి విమానాల కోసం ఇతర నమోదిత వ్యక్తులకు సమాచారం ఇస్తాం’ అని పేర్కొంది. మరోవైపు, భారతీయ పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటుచేసినట్టు అక్కడి ఎంబసీ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో +972-35226748, +972-543278392 నంబర్లకు ఫోన్ చేయాలని, cons1.telaviv@mea.gov.in మెయిల్ చేయాలని సూచించింది. కోరింది.
ఇజ్రాయేల్ గడ్డపై హమాస్ ఆకస్మిక దాడి, ముష్కరులు ఇళ్లలోకి చొరబడి పౌరులను హతమార్చడంతో బెంజిమిన్ నెతన్యాహు సర్కారు యుద్ధం ప్రకటించింది. హమాస్‌పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అధికార, విపక్షాలు ఎమర్జెన్సీ యూనిటీ గవర్నమెంట్‌ను ఏర్పాటుచేశాయి. మాజీ రక్షణమంత్రి, ప్రతిపక్ష నాయకుడు బెన్నీ గాంట్జ్‌తో కలిసి వార్ క్యాబినెట్ ఏర్పాటుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంగీకారం తెలిపారు. పూర్తిగా యుద్ధంపైనే వీరు దృష్టిసారించనున్నారు.
హమాస్ అధీనంలోని గాజా స్ట్రిప్‌పై భారీ బాంబు దాడులతో ఇజ్రాయేల్ విరుచుకుపడుతోంది. ప్రతీకార దాడులతో గత ఆరు రోజులుగా వేలాది మంది మరణించారు. మరోవైపు, దాదాపు 150 మంది పౌరులను హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
వారిలో కనీసం 14 మంది థాయ్‌లు, ఇద్దరు మెక్సికన్లు, పెద్ద సంఖ్యలో అమెరికన్లు, జర్మన్లు ఉన్నారు. ఇదే సమయంలో లెబనాన్‌తో ఉత్తర సరిహద్దులో ఇరాన్-మద్దతుగల షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా నుంచి కూడా ఇజ్రాయేల్ ముప్పును ఎదుర్కొంది. ఇజ్రాయేల్‌పై క్షిపణులను ప్రయోగించినట్టు హిజ్బుల్లా గ్రూప్ బుధవారం ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని మిలిటరీ అబ్జర్వేషన్ పోస్ట్‌లలో ఒకదానిపై దాడి చేయడంతో ప్రతిస్పందించినట్లు ఇజ్రాయేల్ సైన్యం తెలిపింది.
గాజా సరిహద్దును ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకొని, గాజాలోకి ఆహారం, నీరు, విద్యుత్తు, ఇతరత్రా వంటివి సరఫరా కాకుండా దిగ్బంధించిన నేపథ్యంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గాజాలో ఉండే ఏకైన పవర్ ప్లాంట్‌కు ఇంధన కొరత ఏర్పడి, విద్యుత్తు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో దవాఖానల్లో కూడా సంక్షోభ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తున్నది. దాడుల్లో గాయపడిన వేలాది మంది దవాఖానల్లో చికిత్స తీసుకొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డీజిల్ ఉన్నవారు విద్యుత్తు కోసం జనరేటర్లపై ఆధారపడుతున్నారు. అంతకుముందు ఇంధన కొరత కారణంగా విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని, ఇది గాజాను పూర్తిగా అంధకారంలోకి నెట్టివేస్తుందని, ప్రాథమిక సేవలు అందించేందుకు అసాధ్యమవుతుందని గాజా ఎనర్జీ అథారిటీ పేర్కొన్నది.
మరోవైపు, గాజాలో ఇజ్రాయేల్ దాడులతో పరిస్థితి దిగజారుతుందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో సిరియా, లెబనాన్‌ల నుంచి దాడులతో మరింత కలవరపడుతోంది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు