13న అయోధ్యలో కరసేవకుల జ్ఞాపకార్ధం దీపాలు

అక్టోబర్ 13న, కరసేవకుల జ్ఞాపకార్థం అయోధ్యలోని రామ్ పౌరిలో దీపాలను వెలిగిస్తారు. రామమందిరం స్వప్నం ఆవిష్కారం కావడంలో కీలకమైన పాత్రవహించిన కరసేవకులను గుర్తుతెచ్చుకొని, వారి గౌరవార్ధం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 
 
1990లో అక్టోబర్ 30 నుండి నవంబర్ 2 వరకు విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లుఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు.అంతకు ముందే అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే డిమాండ్ తో  అప్పటి బీజేపీ అధ్యక్షుడు  లాల్ కృష్ణ అద్వానీ దేశవ్యాప్త రథయాత్రను నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్  కరసేవకులపై కాల్పులు జరపాలని ఆదేశించారు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర శ్రీ రామజన్మభూమి తీర్థం ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ  వేడుకను ప్రకటిస్తూ ఎన్నో ఏళ్ల పోరాటం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో రామమందిర కలను సాకారం చేసిన వారిని స్మరించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. రామ్ పౌరి అనేది సరయు నది ఒడ్డున ఉన్న వరుస ఘాట్‌లను సూచిస్తుంది.
 
నవరాత్రుల సందర్భంగా కంచి కామకోటి పీఠానికి చెందిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు కూడా చేస్తామని చంపత్ రాయ్ ప్రకటించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15న ప్రారంభమవుతాయి.
 
రామమందిరానికి విదేశీ విరాళాల స్వీకరణపై వివరణ ఇస్తూ అవసరమైన అనుమతుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. “అనుమతులు పొందిన వెంటనే, ట్రస్ట్ విరాళాలను స్వీకరించడం ప్రారంభిస్తుంది. ప్రతిదీ భారత ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది. అన్ని నియమాలు అనుసరించబడతాయి” అని రాయ్ స్పష్టం చేశారు.
 
ట్రస్ట్ అన్ని ముఖ్యమైన ప్రాణ్ ప్రతిష్ఠ (జీవాన్ని విగ్రహంలోకి చొప్పించడం) వేడుక కోసం పూజారులకు శిక్షణ ఇస్తుంది. ఈ వేడుకలో ఉపయోగించిన బియ్యం, పసుపు,నెయ్యిలతో 200 మందికి పైగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు 45 ప్రాంతాలకు వెళ్లి భక్తులకు అందిస్తారు. వేడుక కోసం ఆహ్వాన కార్డులు వివిధ భాషలలో ముద్రిస్తారు. 
 
కార్యకర్తలు తమ తమ గ్రామాలు/నగరాల్లోని దేవాలయాలలో ప్రాణ ప్రతిష్ఠా ప్రార్థనలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరతారు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 22 వరకు సాగే ప్రారంభ దర్శనానికి ఆహ్వానించిన సాధువులతో పాటు, విదేశాల నుండి భక్తులను కూడా ఆహ్వానిస్తారు.

ఇలా ఉండగా, ములాయం సింగ్ ప్రభుత్వం జరిపిన కాల్పులలో 50 మందికి పైగా కరసేవకులు మృతి చెందారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకు వారి పేర్లను వీధులకు పెట్టాలని రెండేళ్ల క్రితం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది.  మొదటగా ఈ కాల్పులలో మృతి చెందిన కలకత్తాకు చెందిన రామ్, శరద్ కొఠారి సోదరుల పేరును అయోధ్యలో ఒక రహదారికి పెట్టారు.
 
ఈ రహదారులకు `బలిదాని రామ్ భక్త్ మార్గ్’ అనే పేరుతో అమరవీరులైన కరసేవకుల ఫొటోలతో ఆయా రోడ్లలో శిలాఫలకాలు ఉంచాలని రాష్త్ర ప్రభుత్వం నిర్ణయించింది.