మైసూర్ లో దసరాకు ఉద్రిక్తలు రాజేస్తున్న మహిష ఉత్సవం

మైసూర్ లో దసరాకు ఉద్రిక్తలు రాజేస్తున్న మహిష ఉత్సవం
దసరా నేపథ్యంలో దేశంలోనే సాంస్కృతిక నగరంగా పేరొందిన మైసూర్ రంగరంగ వైభవంగా ఉత్సవాల నిర్వహణకు ముస్తాబు అవుతూ ఉండగా ఒక వర్గం వివాదాస్పదమైన మహిష ఉత్సవం జరిపేందుకు ప్రయత్నిస్తుండటం ఉద్రిక్తలకు దారితీస్తుంది. రోజుకొక వివాదం చెలరేగుతూ ఉండడంతో మహిష ఉత్సవాన్న నిర్వహించడానికి అవకాశం లేదని మైసూరు సిటీ పోలీసులు తేల్చి చెప్పారు.
 
ఈనెల13వ తేదీన మహిష దసరా ఉత్సవాలు నిర్వహించడానికి కొంత మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మహిష దసరాను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు `ఛలో చామండికొండ ర్యాలీ’కి పిలుపునిచ్చారు. మహిష దసరాకు, బీజేపీ నాయకుల ర్యాలీకి అనుమతి లేదని మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. 
 
దసరా ఉత్సవాలకు నగరంలో రోడ్ల మీద గుంతలను మూసేస్తూ ప్యాలెస్ భవనంలో బల్బులు మారుస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. కానీ మధ్యమధ్యలో మహిష దసరా సందడి గత రెండు వారాలుగా మైసూరు నగరంలో కలకలం రేపుతోంది. బీజేపీ (BJP) ఎంపీ ప్రతాపసింహ, మైసూరు మేయర్ శివకుమార్, ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్‌లతో పాటు బీజేపీ కార్యకర్తలు మహిష ఉత్సవాన్ని వ్యతిరేకించారు. 
 
మహిష దసరా జరుపుకోనివ్వబోం అని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ తేల్చి చెప్పారు. మహిష దసరాను వ్యతిరేకిస్తూ 14వ తేదీన `చలో చాముండిబెట్ట’ నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటించారు. మహిష దసరా నిర్వహిస్తే దసరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిరసన తెలుపుతామని ఎంపీ ప్రతాప్ సింహ హెచ్చరించారు. 
 
మహిష దసరా (వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహమహి కృష్ణ మైసూర్ 8వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మహిష దసరా అమలు కమిటీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసి పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. మైసూరు నగరంలోని కొన్ని వార్డుల్లో బీజేపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించి మహిష దసరా ఉత్సవాలను  బహిష్కరించాలని, మహిష దసరాను వ్యతిరేకించాలని పిలపునిచ్చారు.
 
2015 నుంచి దళిత అనుకూల సంస్థలు మైసూర్‌లో మహిష దసరా జరుపుకుంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిష దసరాకు అవకాశం రాలేదు. ఇప్పుడు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చాక మహిష దసరా వేడుకలు మళ్లీ తెరపైకి వచ్చాయి.  కాగా, మహిషా సమితి దసరా లేదా చాముండేశ్వరిని వ్యతిరేకించడం లేదని, మహిష విగ్రహానికి మాత్రమే పూలమాల వేస్తామని స్పష్టం చేశారు. 
 
మహిష దసరా సెలబ్రేషన్ కమిటీ,  మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం 13వ తేదీన మహిష దసరా జరుపుకోవాలని నిర్ణయించాయి. చాముండి కొండను మహిష కొండగా నమోదు చేసిన ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేయడంతో వివాదం  చెలరేగింది.