అరుంధతి రాయ్ పై ప్రాసిక్యూషన్ కు అనుమతి

గతంలో ఢిల్లీలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఘటనలో ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్,  కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్  షేక్ షోకత్ హుస్సేన్‌లపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం  చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద  నేరారోపణలు చేసేందుకు ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వి కె సక్సేనా అనుమతి ఇచ్చారు.   ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశంపై 2010 నవంబర్ 29న ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా, ఐపీసీ 124 ఏ కింద ఇప్పటివరకు దేశద్రోహం నేరారోపణకు అనుమతి లభించకపోవడంతో ఈ కేసు ముందుకు సాగలేదు.

“దేశ రాజధానిలో ఒక బహిరంగ కార్యక్రమంలో వారి ప్రసంగాలు సెక్షన్ 153ఏ (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన వాటి మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సమూహాలు,  సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే  విధంగా వ్యవహరించడం), 153బి (జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే వాదనలు, ఆరోపణలు), 505 (ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు) కింద నేరం చేసినందుకు  అరుంధతీరాయ్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ లా మాజీ ప్రొఫెసర్ హుస్సేన్‌లపై ప్రాథమికంగా కేసు నమోదు చేసిన్నట్లు లెఫ్టనెంట్ గవర్నర్ వికె సక్సేనా తెలిపారు” అని రాజ్ నివాస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. 

ఈ కేసులో కాశ్మీర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఢిల్లీలోని తిలక్ మార్గ్ ఎస్‌హెచ్‌ఓకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, “ఆజాదీ – ది ఓన్లీ వే” బ్యానర్‌తో జరిగిన సమావేశంలో పలువురు వ్యక్తులు బహిరంగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్  21, 2010న ఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్‌లోని ఎల్ టి జి ఆడిటోరియంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సి ఆర్ పి పి) నిర్వహించింది.

ఆ కార్యక్రమంలో చర్చించి ప్రచారం చేసిన అంశం “భారత్ నుండి కాశ్మీర్‌ను వేరు చేయడం” అని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. అరుంధతి రాయ్, హుస్సేన్‌లతో పాటు అప్పటి తెహ్రీక్-ఎ-హురియత్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ, మావోయిస్టు సానుభూతిపరుడు వరవరరావు కూడా నిందితులుగా ఉన్నారని పేరు బహిరంగపరచని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భీమా-కోరెగావ్ కేసు కూడా ఉంది. మరో ఇద్దరు నిందితులు కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ, సాంకేతిక కారణాలతో పార్లమెంట్‌పై దాడి కేసులో సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన ఢిల్లీ యూనివర్సిటీ లెక్చరర్ సయ్యద్ అబ్దుల్ రహ్మాన్ గిలానీ మరణించినట్లు రాజ్ నివాస్ ప్రకటనలో తెలిపారు.

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా), 1967లోని సెక్షన్ 13 కింద కూడా కేసు నమోదు చేసినప్పటికీ, దేశద్రోహం నేరారోపణలు కింద నమోదైన కేసులు అన్నింటిని పెండింగ్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటివరకు లెఫ్టనెంట్ గవర్నర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు  అనుమతి ఇవ్వలేదు. వారే కేసులో ఈ అంశాన్ని రాజ్యాంగ బెంచ్ కు నివేదించడంతో ఇటువంటి కేసులు అన్నింటిని పెండింగ్ లో ఉంచమని సుప్రీంకోర్టు ఆదేశించింది.