
అంతరిక్ష నౌక ఆదిత్య ఎల్1 సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని ఇస్రో ప్రకటించింది. అయితే, సరైన మార్గంలో ఉంచేందుకు కీలకమైన ఆపరేషన్ నిర్వహించినట్లు ఆదివారం వెల్లడించింది. స్పేస్ క్రాప్ట్ లోని ఇంజన్లను 16 సెకన్ల పాటు మండించి ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్‌యూవర్ (టిసిఎం) ని నిర్వహించినట్లు తెలిపింది.
ఇటువంటి దిద్దుబాటును ఇస్రో చేబట్టడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 19న ప్రదర్శించిన ట్రాన్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (టిఎల్ 1 ) ట్రాక్ చేసిన తర్వాత దాని మార్గాన్ని సరిచేసేందుకు మాన్యువర్ అవసరమని భావించినట్లు ఇస్రో ఎక్స్ (ట్విటర్)లో పేర్కొంది.
ఎల్ 1 చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో నౌకను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన మార్గంలో నౌకను ఉంచేందుకు టిసిఎం చేపట్టినట్లు తెలిపింది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించాల్సి వచ్చినట్లు ఇస్రో చెప్పింది. ట్రాజెక్టరీ కరెక్షన్ చేయడంతో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష వాహక నౌక ఉద్దేశించిన మార్గంలో సాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని పేర్కొన్నారు.
ఆదిత్య ఎల్ 1 ముందుకు సాగుతోందని, మరికొన్ని రోజుల్లో మాగ్నెటో మీటర్ మళ్లీ అన్ చేయబడుతుందని ఇస్రో పోస్ట్ చేసింది. అంతరిక్ష నౌక ఆరోగ్యంగా ఉందని, కీలక గమ్యస్థానానికి చేరుకుంటోందని పేర్కొంది. సెప్టెంబర్ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సూర్యుడికి, భూమికి మధ్య 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఎల్ 1 పాయింట్ వద్దకు వెళ్తోంది.
ఇప్పటికే 9 లక్షల కిలోమీటర్ల వరకు ఉండే భూమి గురుత్వాకర్షణ శక్తిని నౌక తప్పించుకుని ముందుకెళ్లింది. ఆదిత్య ఎల్ 1 సైంటిఫిక్ డేటాను సేకరించడం కూడా ప్రారంభించింది. ఎస్‌టిఇపిఎస్ (సుప్రా థర్మల్, ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్) పరికరం యొక్క సెన్సార్‌లు భూమి నుండి 50,000 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న సుప్రా-థర్మల్ , ఎనర్జిటిక్ అయాన్‌లు, ఎలక్ట్రాన్‌లను కొలవడం ప్రారంభించాయి. ఈ డేటా భూమిచుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దాదాపు 120 రోజుల పాటు ప్రయాణించి లాగ్రేంజియన్ పాయింట్‌కు చేరుకోనున్నది. ఇది భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. సౌర గాలులు, సౌర తుఫాన్లతో పాటు నక్షత్రాల అధ్యయనంలోనూ సహాయం అందించనున్నది. నక్షత్రాలు, గెలాక్సీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక రహస్యాలను అర్థం చేసుకోవడం సహాయపడనున్నది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్