వన్డే ప్రపంచకప్‌ తొలి పోరులో భారత్‌ జయభేరి

స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (46; 5 ఫోర్లు), డేవిడ్‌ వార్నర్‌ (41; 6 ఫోర్లు) రాణించగా, మిషెల్‌ స్టార్క్‌ (28), మార్నస్‌ లబుషేన్‌ (27) కాస్త పోరాడారు. 

భారత బౌలర్లలో జడేజా 3, బుమ్రా, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌, పాండ్యా, అశ్విన్‌ తలా ఒక వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (0), శ్రేయస్‌ అయ్యర్‌ (0) సున్నాలు చుట్టగా.. కేఎల్‌ రాహుల్‌ (115 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (116 బంతుల్లో 85; 6 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హజిల్‌వుడ్‌ మూడు వికెట్లు తీశాడు. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో కోహ్లీ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు మార్ష్‌ (0) ఔట్‌ కాగా, ఆ తర్వాత వార్నర్‌, స్మిత్‌ ఆసీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరితో పాటు లబుషేన్‌ కూడా రాణించడంతో ఒక దశలో ఆసీస్‌ 110/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. అయితే స్లో పిచ్‌పై తమ ప్రతాపం చూపిన అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ పరుగులు నియంత్రిస్తూ,  కంగారూలపై ఒత్తిడి పెంచారు. 

దీంతో ధాటిగా ఆడేందుకు యత్నించిన ఆసీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 89 పరుగుల తేడాలో చివరి 8 వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్‌ విరామం అనంతరం భారత్‌కు దెబ్బమీద దెబ్బ తగిలింది. ఇషాన్‌ తొలి ఓవర్‌లోనే ఔట్‌ కాగా, రెండో ఓవర్‌లో డబుల్‌ స్ట్రోక్‌గా రోహిత్‌, శ్రేయస్‌ వెనుదిరిగారు. 

ఈ దశలో మ్యాచ్‌పై ఆసీస్‌ పట్టు బిగించినట్లే అనిపించింది. కానీ కోహ్లీ ఉన్నంత వరకు కంగారూలకు ఇబ్బంది తప్పదని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ క్లార్క్‌ అన్నట్లు విరాట్‌ తన పవర్‌ ఏంటో చాటాడు. ఇక మూడు వికెట్లు కోల్పోయినా కోహ్లీ, రాహుల్ చాలా బాధ్యతాగా సింగిల్స్ తీస్తూ, అడపాదడపా బౌండరీలకు తరలిస్తూ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

 పరిస్థితులు సవాలు విసురుతున్న సమయంలోనే తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని తట్టిలేపే కోహ్లీ వికెట్ల మధ్య పరిగెడుతూనే 61 పరుగులు తీశాడంటే అతడి ఇన్నింగ్స్‌ విలువేంటో అర్థం చేసుకోవచ్చు! గతంలో ఎన్నోసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అవలీలగా ఎదుర్కొన్న కోహ్లీ.. అదే సంయమనం మరోసారి కనబర్చాడు.