
ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నర్గెస్ మొహమ్మదికి ఈ యేటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. నార్వే నోబెల్ కమిటీ ఆ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్లో మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ అన్న నినాదాంతో ఆమె ఉద్యమం నడిపారు.
ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది, స్వతంత్ర పోరాటయోధురాలు నార్గెస్ మహమ్మది ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఇరాన్లో మహిళల హక్కుల కోసం నార్గెస్ మహమ్మది చేసిన అలుపెరుగని పోరాటానికి గానూ ఈ ఏడాది ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే ప్రస్తుతం నార్గెస్ మహమ్మది జైలులో ఉన్నారు.
మానవ హక్కుల అడ్వకేట్‌గా ఆమె ఇరాన్లో పాపులర్. ఫ్రీడం ఫైటర్ కూడా. టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో గత ఏడాది రాజకీయ ఖైదీలను బంధించారు, ఆ సమయంలో జరిగిన నిరసనల్లో మొహమ్మది పాల్గొన్నారు. వుమెన్-లైఫ్-ఫ్రీడం నినాదంతో ఆమె నిరసనలు చేపట్టారు. 2022 సెప్టెంబరులో ఇరాన్లో హిజాబ్ సరిగా ధరించలేదని.. 22 ఏళ్ల మహ్సా జినా అమ్నీని మోరల్ పోలిసింగ్ చేస్తున్న పోలీసులు తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది.
ఇరాన్లో కొనసాగుతున్న మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఈ క్రమంలోనే ఈ నిరసనల్లో ముందుండి పోరాడిన నార్గెస్ మహమ్మదికి ఈ నోబెల్ శాంతి పురస్కారం దక్కడం విశేషం. మహిళలు- జీవితం-స్వేచ్ఛ అనే నినాదాలతో నార్గెస్ మహమ్మది పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఈ విషయాలన్నింటినీ నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించిన వేళ నోబెల్ కమిటీ వెల్లడించింది.
మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన నర్గెస తన జీవితాన్ని జైలుకే అంకితం చేసింది. ఆమెను దాదాపు 13 సార్లు ఇరాన్ సర్కార్ అరెస్టు చేసింది. అయిదు సార్లు ఆమెను దోషిగా నిర్దారించారు. ఆమెకు దాదాపు 31 ఏళ్ల జైలుశిక్షను వేశారు. 154 కొరడా దెబ్బలు కూడా తిన్నది. ప్రస్తుతం మొహమ్మది ఇంకా జైలులోనే ఉన్నారు.
సోమవారం మొదలైన ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన వారం రోజుల పాటు సాగనుంది. సోమవారం మెడిసిన్, మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం లిటరేచర్ విభాగాల్లో 2023 ఏడాదికి గానూ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను స్వీడిష్ కమిటీ వెల్లడించింది.
ఇక శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న నార్గెస్ మహమ్మది పేరును వెల్లడించారు. ఈ నెల 9 వ తేదీన అర్ధ శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతల పేర్లను ప్రకటించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 10 వ తేదీన విజేతలకు నోబెల్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. గతంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి ఇచ్చే నగదు బహుమతి రూ.7.58 కోట్లు ఉండగా, దాన్ని ఈసారి కాస్త పెంచి రూ.8.35 కోట్లు చేశారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
ఆఫ్ఘన్ సరిహద్దులో 12 మంది పాక్ సైనికుల మృతి
భారత్, అఫ్గాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ అక్కసు