ఆగస్టులో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాల నిలిపివేత

భారతదేశంలో ఆగస్టులో 74.2 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది. అంతకు ముందటి నెల జులైతో పోలిస్తే ఇది దాదాపు రెండు లక్షల ఖాతాల వరకూ ఎక్కువగా ఉంది. సరికొత్త ఐటిరూల్స్ 2021 నిబంధనల మేరకు ఈ ఖాతాలను స్తంభింపచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 

తమ వేదిక ద్వారా అశ్లీల సమాచారం, తప్పుడు వార్తల ప్రచారానికి పాల్పడుతున్న ఖాతాలను తమకు అందిన ఫిర్యాదుల మేరకు పరిశీలించుకుని తాము వీటిని నిషేధించినట్లు వాట్సాప్ నిర్వాహకులు ప్రకటన వెలువరించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చూస్తే నిషేధంలోకి వచ్చిన వాట్సాప్ ఖాతాల సంఖ్య ఇప్పటి లేక్కతో కలిపితే దాదాపు 3,506,905కు చేరింది.

వీటిని పూర్తి స్థాయిలో నిషేధిత ఖాతాల జాబితాలో చేర్చారు. యూజర్ల నుంచి ఎటువంటి వివరణలు తీసుకోకుండానే మెటా యాజమాన్యపు వాట్సాప్ ఈ చర్యకు పాల్పడింది. ఐటి నిబంధనల మేరకు ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని వాట్సాప్ తెలిపింది. 

గడిచిన నెల సెప్టెంబర్‌లో దేశంలో 72.28 లక్షల అకౌంట్లను నిలిపివేశారు. ఇందులో దాదాపు 3 లక్షల పదివేల అకౌంట్లపైనా ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిషేధించారు.  ఆగస్టులో నిషేధించిన ఖాతాలలో దాదాపు 35 లక్షల వరకూ అకౌంట్లను ముందస్తు కట్టడిలో భాగంగానే నిలిపివేశారు.

 ఏ యూజర్ కూడా తమ ఖాతాలను దుర్వినియోగపర్చుకోకుండా చూడటమే తమ లక్ష్యమని కంపెనీ వర్గాలు తమ ఇండియా మంత్లీ అక్టోబర్ నెల నివేదికలో తెలిపాయి. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వాట్సాప్ సమాచార వినిమయానికి ప్రాధాన్యత ఏర్పడింది. 

సామాజిక మాధ్యమాలు ప్రత్యేకించి వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి బహుళ జన వినియోగిత సాధనాలు కావడంతో వీటిపై నియంత్రణకు భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో నిర్థిష్ట చర్యలకు దిగింది. సరైన విధంగా ఐటి రూల్స్‌ను పటిష్టం చేసింది. ఇందులో భాగంగా 50 లక్షల యూజర్ల సంఖ్య వరకూ ఉన్న ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ ప్రతి నెలా నివేదికను పొందుపరచాల్సి ఉంటుంది. తమకు అందిన ఫిర్యాదులు, వీటిపై తీసుకున్న తీసుకుంటున్న చర్యల వివరాలను ఇందులో విధిగా తెలియజేయాల్సి ఉంటుంది.