హిందూ ఆలయంలో స్టాలిన్‌ కుమార్తె పూజలు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉదయనిధి సోదరి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కుమార్తె సెంథామరై ఓ హిందూ ఆలయంలో పూజలు చేయడం అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నది.
 
మైలాడుతురై జిల్లా సిర్కాజీలోని సత్తైనాథర్‌ ఆలయాన్ని సెంథామరై స్టాలిన్‌ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కళ్లకు అద్దుకుని, కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘మరి దీన్ని ఏమంటారు..?, ఇది సనాతన ధర్మం కాదా..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ సనాతన ధర్మంపై అనుచితవ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మం” డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఉదయనిధితోపాటు తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు పోలీసులు సహా 14 మందికి నోటీసులు కూడా జారీ చేసింది.