350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న శివాజీ ఆయుధం

350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న శివాజీ ఆయుధం
17 వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన ఆయుధం తిరిగి భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఉపయోగించిన వాఘ్ నఖ్ (పులి గోళ్లు)ను స్వదేశానికి తీసుకురానున్నారు. నవంబరులో ఇది భారత్‌కు చేరుకోనుంది. 

మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు అవసరమైన ఒప్పంద పత్రాలపై మంగళవారం లండన్‌లో సంతకాలు చేయనున్నారు. 17వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధ రాజు ప్రసిద్ధ ‘జగదాంబ’ ఖడ్గాన్ని లండన్ మ్యూజియం నుంచి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

“తొలి దశలో భాగంగా వాఘ్ నఖ్‌ను నవంబరులో భారత్‌కు తీసుకొస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్‌ను ఓడించిన రోజునే దాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో దాన్ని ప్రదర్శనకు ఉంచుతాం” అని సుధీర్ తెలిపారు.

అలాగే దేశంలోని మరో నాలుగు ప్రాంతాల్లో ఈ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మ్యూజియం వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్‌బర్ట్ మ్యూజియంలో వాఘ్ నఖ్ ఉంది. ఇది 17 వ శతాబ్దం నాటిదని మ్యూజియం రికార్డుల్లో పేర్కొన్నారు. 

బీజపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌ను ఇదే వాఘ్ నఖ్‌తో ఛత్రపతి శివాజీ హతమార్చినట్టు చరిత్ర చెబుతోంది. “అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్‌ను వెనుక భాగంలో పొడిచినప్పుడు (సమావేశంలో), క్రూరమైన, రాక్షసుడైన అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి శివాజీ మహారాజ్ ‘వాఘ్ నఖ్’ను ఉపయోగించాడు” అని మంత్రి పేర్కొన్నారు.

1659లో ‘వాఘ్ నఖ్’ అనే పదునైన ఇనుప ఆయుధంతో పులి గోళ్ల ఆకారంలో శివాజీ.. ఖాన్‌ను చంపాడు. ప్రస్తుత సతారా జిల్లాలోని ప్రతాప్‌గడ్ కోట పాదాల వద్ద ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఇది జరిగింది. ‘జగ్దాంబ’ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ఉత్సవ ఖడ్గం. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్థుడైన శివాజీ IV, వజ్రాలు. కెంపులతో అమర్చబడిన ‘జగ్దాంబ’ ఖడ్గాన్ని అప్పటి వేల్స్ యువరాజుగా ఉన్న ఆల్బర్ట్ ఎడ్వర్డ్‌కు బహుకరించాడు.