టర్కీ పార్లమెంట్​కు​ సమీపంలో బాంబు పేలుడు!

టర్కీ రాజధాని అంకారాలో జరిగిన ఉగ్రదాడి కలకలం సృష్టించింది. పార్లమెంట్ ​ భవనానికి సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారని సమాచారం. కాగా, ఆత్మహుతి దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో మరో వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు అతడిని హతమార్చారు.
 
దుండ‌గులు ఆదివారం ఉద‌యం 9.30 గంట‌ల ప్రాంతంలో వాహ‌నంలో అంకారాలోని పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌కు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్ప‌డ్డార‌ని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు తెలిపాయి. ఉగ్ర‌వాదుల్లో ఒక‌రు ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డాడ‌ని అధికారులు వెల్ల‌డించారు.  ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పోలీస్ అధికారుల‌కు స్వ‌ల్ప గాయాలయ్యాయి.
దాడి జరిగిన ప్రాంతంలో ట‌ర్కీ పార్ల‌మెంట్ స‌హా ప‌లు మంత్రిత్వ శాఖ‌ల కార్యాల‌యాలున్నాయి. అధ్య‌క్షుడు ఎర్దోగ‌న్ ప్ర‌సంగం నేప‌ధ్యంలో ట‌ర్కీ పార్ల‌మెంట్ నేడు తిరిగి ప్రారంభం కానున్న రోజే ఉగ్ర‌వాదులు దాడికి తెగ‌బ‌డ‌టం విశేషం. దాడి జరిగిన ప్రాంతాన్ని భ‌ద్ర‌తా ద‌ళాలు స్వాధీనం చేసుకోగా, అత్య‌వ‌స‌ర సేవ‌లు కొన‌సాగుతున్నాయని అధికారులు తెలిపారు.

“ఇద్దరు ఉగ్రవాదులు మిలిటరీ వాహనంలో ఉదయం 9:30 గంటలకు వచ్చారు. ఇంటీరియర్​ మినిస్ట్రీలోని జనరల్​ డైరెక్టరేట్​ ఆఫ్​ సెక్యురిటీ విభాగం ఉన్న గేట్​ వద్దకు వెళ్లారు. అక్కడ పేలుడు సంభవించింది,” అని చెబుతూ ఇదొక ఉగ్రవాద ఘటన అని టర్కీ ప్రభుత్వం వెల్లడించింది.

అంకారాలో ఇంకొన్ని గంటల్లో పార్లమెంట్​ సమావేశలు మొదలవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్​ భవనానికి సమీపంలో పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది. పార్లమెంట్​కు సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రంగంలోకి దిగిన బాంబ్​ స్క్వాడ్​లు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్నాయి.

ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికైతే.. ఘటనాస్థలంలోకి, పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదని వెల్లడించింది. టర్కీ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరు? అన్న విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

కాగా పార్లమెంట్​కు సమీపంలో బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. టర్కీ రాజధాని నగరం అంకారాలో బాంబు పేలుడు ఘటనలు అక్కడి ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2015, 2016 సమయంలో నిషేధిత పీకేకే (కుర్దిస్థాన్​ వర్కర్స్​ పార్టీ) వేర్పాటువాద కార్యకలాపాలతో అంకారా అట్టుడికింది.