తెలంగాణలో ఈ ఎన్నికల తర్వాత ‘చెప్పింది చేసే ప్రభుత్వమే’

తెలంగాణలో ఈ ఎన్నికల తర్వాత ‘చెప్పింది చేసే ప్రభుత్వమే’
తెలంగాణ ప్రజలు మార్పు కొరుకుంటున్నారని చెబుతూ  మాటలతో మభ్యపెట్టే ప్రభుత్వం కాదు.. పని చేసే పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.   తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో చెప్పింది చేసే ప్రభుత్వమే రానుందంటూ ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 
 
అబద్దాలు, వాగ్దానాలు కాదు.. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పనులు చేసే ప్రభుత్వం కావాలని.. అవినీతి రహిత పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఆధ్యర్వంలో నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావం పూరించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ.. తెలంగాణ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 
 
తెలంగాణ అభివృద్దిని రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఈ రోజు నిద్రపట్టదంటూ తనదైన శైలిలో చురకలంటించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందిరికీ తెలుసంటూ బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. 
 
కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు  ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చుతున్నారని ప్రధాని విమర్శించారు. కరప్షన్, కమిషనే రెండు పార్టీల సిద్ధాంతమని చెప్పుకొచ్చారు. రాజకీయల పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చేశారని ప్రధాని ధ్వజమెత్తారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారని గుర్తు చేశారు. 
 
పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులు ఉంటారని, తమ అవసరాల కోసం కొన్ని పోస్టుల్లో మాత్రం బయటి వాళ్లు ఉంటారని అంటూ చురకలు అంటించారు.
కానీ బీజేపీ మాత్రం సామాన్యుల గురించే ఆలోచిస్తుందంటూ చెప్పుకొట్టారు మోదీ. సామాన్యుల మెరుగైన జీవన ప్రమాణాల గురించి బీజేపీ ఆలోచిస్తుందని చెప్పారు. 
 
తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ ఆదరణ పెరుగుతోందని పేర్కొంటూ నాలుగేళ్లలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేశారని ప్రధాని తెలిపారు. అందుకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు. మోదీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉందని పేర్కొన్నారు. 
 
మోదీ హామీ ఇచ్చారంటే.. నెరవేర్చుతారన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉందని ప్రధాని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు. పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామని మోదీ చెప్పారు. 
 
ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులుకు కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. మహిళల జీవితాలను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని చెబుతూ అందులో భాగంగానే మహిళా బిల్లును ఆమోదించుకున్నామని తెలిపారు.
 
 2014కు ముందు కేవలం 2400 కిలోమీటర్ల జాతీయ రహదారులు  ఉండేవని, ఈ పదేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం 2500 కిలో మీటర్ల జాతీయ రహదారులను నిర్మించిందని ప్రధాని వెల్లడించారు.  రైతులను తెలంగాణ ప్రభుత్వం మభ్యపెడుతోందంటూ సాగునీటి పథకాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. 
 
సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు అంటూ ప్రధాని విమర్శించారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చినా తెలంగాణ సర్కారు అమలు చేయలేదన్ని మోదీ గుర్తు చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తెలంగాణలో తమ ప్రభుత్వం లేకున్నా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం రామగుండం ఫెర్టిలైజర్స్‌ను తెలిపించామని ప్రధాని గుర్తు చేశారు. రైతులకు సరసమైన ధరలకే ఎరువులను అందిస్తున్నామని చెప్పారు.