విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు మోక్షం

దసరా నుండి విశాఖపట్నం నుండే పరిపాలన ప్రారంభం అవుతుందని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టును పరుగులు పట్టించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా విశాఖలో మెట్రో రైలు పరిధిని 75 కిలోమీటర్లుగా నిర్ణయించిన ప్రభుత్వం నాలుగు కారిడార్లుగా దీన్ని అభివృద్ధి చేయబోతోంది. 

ఇందుకోసం సమగ్ర వివరాలతో డీపీఆర్ త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి విశాఖ రాజధాని అభివృద్ధిపై అధికార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ మెట్రో ప్రాజెక్ పై చర్చలు జరిపారు.

మరోవైపు తొలి విడతలో 76.90కి.మీ. మేర లైట్ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈలోగా నిధుల సమీకరణను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి మెట్రోరైల్ కార్పొరేషన్ కు మార్గదర్శకాలు జారీ చేశారు.  కార్యనిర్వాహక రాజధానిగా అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టించాలంటే మెట్రో ప్రాజెక్టు తప్పనిసరి అని భావిస్తున్న ప్రభుత్వం 75 కిలోమీటర్ల మార్గంలో దీన్ని అభివృద్ధి చేసేందుకు తుది ఆమోద ముద్ర వేసింది.

విశాఖలో ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని 75 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టును నాలుగు కారిడార్లుగా విభజించారు. స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాడి జంక్షన్ వరకూ, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ , తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ, కొమ్మాడి జంక్షన్ నుంచి భోగాపురం వరకూ నాలుగు కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. 

ఈ నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్ సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని విజయవాడలో నిర్వహించిన సమీక్షలో మంత్రి  బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.  వచ్చే ఏడాది కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నాటికి మెట్రో పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

 ఆ తర్వాత రెండో విడత కింద కారిడార్-4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు 30.67 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ నాలుగు కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, రెండు డిపోలుఏర్పాటు చేయనున్నారు. జనవరి 15న మెట్రో రైలు పనులకు పునాది రాయి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.