చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్‌ సస్పెండ్‌

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) పి.శ్రీనివాస్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
శ్రీనివాస్‌ ప్రస్తుతం ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉ‍న్నాడు.
స్కిల్ స్కామ్ లో శ్రీనివాస్ పేరు ఉండటంతో పాటు ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్లు సీఐడీ చెబుతోంది. ఆయన తిరిగి రాష్ట్రానికి రావాలని కొంతకాలంగా కోరుతూ ఉండగా, సెప్టెంబర్ 29వ తేదీని గడువుగా నిర్ణయించింది.  అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెండ్యాల శ్రీనివాస్ కొంత కాలం పీఎస్‌ (వ్యక్తిగత కార్యదర్శి)గా పని చేశారు. ఈ క్రమంలో స్కిల్ కేసులో శ్రీనివాస్ పేరును కూడా తెరపైకి తీసుకువచ్చింది ఏపీ సీఐడీ.  ఆయనను విచారిస్తే మరికొంత సమాచారం దొరుకుతుందని భావిస్తోంది. ప్రభుత్వంలో ఉద్యోగిగా పని చేస్తున్న శ్రీనివాస్ సమాచారం ఇవ్వకుండా అమెరికా వెళ్లారని సీఐడీ ఆరోపిస్తోంది.
కేసు విషయం బయటికి రావటంతోనే ఇలా చేశారని చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనకు విధించిన గడువు ముగియటంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసింది.

మరోవైపు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థాన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ లూథ్రా వాదనలు వినిపించగా,  ఏపీ సీఐడీ తరపున తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.