భాగ్యనగరంలో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం

భాగ్యనగరంలో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం

తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు, శోభాయాత్రలు గురువారం కన్నుల పండుగగా  సాగాయి. భక్తులు ఉత్సాహంగా కోలాటాలు, సాంస్కృతిక నృత్యాలు, డిజె పాటలతో గణనాథుడిని వీడ్కోలు పలికారు. నవరాత్రులు పూజలందుకున్న పార్వతి తనయుడు అశేష భక్త జనం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. 

రాష్ట్రవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో వైభవంగా రంగుల రంగుల దీపాలతో మండపాలు ఏర్పాటు చేసి విఘ్నాలు తొలగించమని వినాయకుడిని భక్తులు వేడుకున్నారు. తొమ్మిది రోజులు చిన్నా పెద్దా కలిసి చేసిన ఉత్సవాల స్మృతులను నెమరువేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. శోభయాత్రలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు, వైద్య శిభిరాలు, ప్రత్యేక బస్సులు, మెట్రోరైళ్లను ఏర్పాటు చేసి నిమజ్జనం ప్రదేశాలకు చేరుకునేలా చేశారు. 

నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది. ట్యాంక్‌బండ్‌, సరూర్‌ నగర్‌ చెరువులతోపాటు హైదరాబాద్‌లో 33 చెరువుల్లో నిమజ్జనం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు, జిహెచ్‌ఎంసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

ఈ ఏడాది దశ మహా విద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన 63 అడుగుల ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్‌టిఆర్‌ మార్గ్‌కు చేరుకుంది. మధ్మాహ్నం ఒంటిగంట సమయంలో అంబేద్కర్‌ విగ్రహం సమీపంలోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు. 

బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్‌ విల్లాస్‌లో జరిగిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు ధర పలికింది. బాలాపూర్‌ లడ్డూను ఈసారి తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణాలో సనాతన ధర్మాన్ని నిర్మూలించే ప్రయత్నాలు

నేడు తెలంగాణలో కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి ఆరోపించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వినాయక స్వాగత వేదికలో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
 
స్వాగత వేదికపై నుంచి నిమజ్జనోత్సవాలకు తరలుతున్న గణనాథులపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సాధ్వి నిరంజన్‌జ్యోతి మాట్లాడుతూ  సనాతన ధర్మాన్ని నిర్మూలిచండానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ వారుకుడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని హెచ్చరించారు. 
“ఒక్కప్పుడు భాగ్యనగరానికి మాత్రమే శోభాయాత్ర ఘనంగా నిర్వహించేది. ఇప్పుడు తెలంగాణ మొత్తం శోభయాత్రలు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా మండపాలను నెలకొల్పిన అశేష వినాయక భక్తులందరికీ శుభాకాంక్షలు” అని తెలిపారు.
 
హైదరాబాద్‌లో 50లక్షల మందికి పైగా భక్తులు గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తొమ్మిదిరోజుల పాటు గణేష్ మండపాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. రానున్న రోజుల్లో గణేష్ ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని చెబుతూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ఈటల రాజేందర్ అభినందనలు తెలిపారు

అదే విధంగా గోదావరి, కృష్ణనది తీర ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనం పెద్ద సంఖ్యలో సాగింది. సమీప జిల్లాలకు చెందిన ప్రజలు అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించి చివరి రోజు అమ్మ ఒడికి గణపతి చేర్చారు.

 గ్రేటర్ వరంగల్ పరిధిలో 25 చెరువులు, కుంటల వద్ద నగరపాలక సంస్థ అధికారులు 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. గణేశ్ మహరాజ్ కీ జై అనే నినాదాలతో ఓరుగల్లు మారుమోగిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏ ర్పాటు చేశారు.