ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన అగ్రికల్చర్ సైంటిస్టు స్వామినాథన్ మృతి తనకు విషాదాన్ని మిగిల్చినట్లు రాష్ట్రపతి ముర్ము తెలిపారు. ఆహార భద్రత కోసం ఆయన అహర్నిశలు శ్రమించినట్లు ఆమె పేర్కొన్నారు.
హరిత విప్లవానికి జాతిపితగా ఆయన్ను పిలవడంలో సందేహం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలు నమోదు చేశారని, దానికి గాను ఆయనకు పద్మ విభూషన్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ లాంటి అవార్డులు దక్కినట్లు రాష్ట్రపతి గుర్తు చేశారు. ఆకలి లేని సమాజాన్ని ఆయన సృష్టించాలనుకున్నారని, భారతీయ వ్యవసాయ క్షేత్రంలో ఆయన చరగనిముద్ర వేశారని నివాళులు అర్పించారు.
స్వామినాథన్ మృతి తనను బాధకు గురిచేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఎక్స్ అకౌంట్‌లో ఆయన తన నివాళి అర్పిస్తూ చాలా కీలకమైన దశలో స్వామినాథన్ చేసిన కృషి వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దాని వల్ల దేశంలో ఆహార భద్రత ఏర్పడిందని పేర్కొన్నారు.
పరిశోధనా రంగంలో ఆయన చూపిన మార్గాన్ని అనేక మంది యువ శాస్త్రవేత్తలు ఫాలో అయినట్లు ప్రధాని తెలిపారు. స్వామినాథన్‌తో ఎన్నో గత స్మృతులు ఉన్నట్లు పేర్కొన్నారు. భారత దేశ ప్రగతి కోసం ఆయన తపించారని ప్రధాని కొనియాడారు. ఆయన జీవితం, పనితనం ఎందరికో స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు. స్వామినాథన్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.

More Stories
ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు.. సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురు
భారతీయ నేలల్లో తీవ్రంగా లోపించిన పోషకాలు
12 రాష్ట్రాల్లో నేటి నుండే రెండో దశ ఎస్ఐఆర్