మణిపూర్ లో బీజేపీ కార్యాలయానికి నిప్పు

 
* రంగంలోకి సీనియర్ కాప్ రాకేష్ బల్వాల్‌
 
మణిపూర్‌లో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్యకు నిరసనలో భాగంగా ఆందోళనకారులు తౌబాల్‌ జిల్లాలోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. దీంతో పాటు ఇంఫాల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. రాజధాని ఇంఫాల్‌తో సహా అనేక చోట్ల నిరసనకారులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ పోలీసు అధికారి రాకేష్ బల్వాల్‌ ను రంగంలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎస్‌ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బల్వాల్‌ను తన సొంత కేడర్‌ అయిన మణిపూర్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాజస్థాన్‌కు చెందిన రాకేష్‌ బల్వాల్‌ 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మణిపూర్‌ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2018లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఎజెన్సీకి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పదోన్నతి పొందారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపిన బృందంలో బల్వాల్‌ సభ్యుడిగా ఉన్నారు. 2021లో శ్రీనగర్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ ఘటనలకు సంబంధించి 1697 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని మోయిరాంగ్‌ఖోమ్‌లో ఆందోళనకారులను నియంత్రించడానికి భద్రతా బలగాలు పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పెల్లెట్ తలలోకి చొచ్చుకుపోవడంతో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. 
 
రెండు రోజులుగా ఇంఫాల్ లోయలో జరిగిన నిరసనల్లో 50 మంది గాయపడ్డారు. ఓ ప్రాంతంలో పోలీసు వాహనాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విద్యార్థి హత్య కేసును విచారించేందుకు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ ఇంఫాల్ చేరుకున్నారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును పొడిగించారు. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు ఇది అమలులో ఉండనుంది.