ఆధార్‌పై మూడీస్ ఆరోప‌ణ‌లు నిరాధారం

కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆధార్ కార్డుల‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్ చేసిన తీవ్ర ఆరోప‌ణ‌లను యునిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఏడీఏఐ) తీవ్రంగా ఖండించింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆధార్ కార్డుల‌పై మూడీస్ సంస్థ ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు యూఏడీఏఐ పేర్కొన్న‌ది. 
 
ఆధార్ కార్డు స‌ర్వీస్ స‌రిగా లేద‌ని, వేడి వాతావ‌ర‌ణంలో బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీ న‌మ్మ‌దగిన‌దిగా లేద‌ని మూడీస్ సంస్థ ఆరోపించింది. అయితే ఎటువంటి సాక్ష్యాలు లేకుండానే ఆధార్ కార్డుల‌పై ఇన్వెస్ట‌ర్ సంస్థ నిరాధార‌ ఆరోప‌ణ‌లు చేసింద‌ని పేర్కొంటూ ప్ర‌పంచంలోనే ఆధార్ కార్డు అత్యంత న‌మ్మ‌క‌మైన డిజిట‌ల్ ఐడీ అని యూఐడఐ స్పష్టం చేసింది.
 
గ‌త ద‌శాబ్ధ కాలంలో వంద కోట్ల మంది భార‌తీయులు త‌మ గుర్తింపును ఆ కార్డుతో వెయ్యి కోట్ల సార్లు చూపించుకున్న‌ట్లు యూఐడీఏఐ ఒక ప్ర‌ట‌క‌న‌లో తెలిపింది.  మూడీస్ ఇచ్చిన డేటాతో తాము ఏకీభ‌వించ‌డం లేద‌ని యూఐడీఏఐ పేర్కొన్న‌ది. ఆధార్ డేటాబేస్‌లో ఎటువంటి ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో కూడా పేర్కొన్న‌ట్లు యూఐడీఏఐ తెలిపింది. 
 
అంత‌ర్జాతీయ సెక్యూర్టీ, ప్రైవ‌సీ ప్ర‌మాణాల ప్ర‌కార‌మే ఆధార్‌ను జారీ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు సహితం ఆధార్ వ్య‌వ‌స్థ‌ను మెచ్చుకున్నాయ‌ని యూఐడీఏఐ గుర్తు చేసింది. అనేక దేశాలు ఆధార్ శైలిలో త‌మ ఐడీల‌ను రూపొందించుకున్న‌ట్లు యూఐడీఏఐ తెలిపింది.
 
ఇలా ఉండగా, ఈ 12 అంకెల బయోమెట్రిక్‌ టెక్నాలజీ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందంటూ మూడీస్‌ హెచ్చరించింది . దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ సేవలను పొందేందుకు ఆధార్‌ను కీలకం చేశారన్న మూడీస్‌ ఈ సమాచారంలో తప్పుల వల్ల అర్హులు ప్రభుత్వ రాయితీలను, ఇతరత్రా చేయూతల్ని అందుకోలేకపోతున్నారని చెప్పింది. 
 
భారత్‌లో ఇప్పటికీ కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారని గుర్తుచేసిన మూడీస్‌ అలాంటి వారందరికీ ఆధార్‌ వ్యవస్థలోని లోపాలు ఇబ్బందికరంగా మారాయన్నది. రోజువారీ శ్రామికులు సైతం ఆధార్‌తో నష్టపోతున్నారన్నది. మొత్తంగా ఉష్ణ, తేమతో కూడిన భారతీయ వాతావరణానికి ఆధార్‌ ప్రామాణిక సేవలు, విధానాలు సరిపోవని తెలిపింది.