గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తమిళిసై

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తమిళిసై
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్ ఇచ్చారు గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిన అభ్యర్థుల సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ సర్కారు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను సిఫార్సు చేశారు.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయంటూ ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. అభ్యర్థులిద్దరూ ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు.. సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపించలేదంటూ గవర్నర్ ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేశారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిథ్య చట్టంలో స్పష్టంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అనర్హత కిందకు రారని చెప్పేలా.. ఇంటెలిజెన్స్ సహా ఏ ఇతర సంస్థల నివేదికలు లేవని గవర్నర్ గుర్తు చేశారు. 

 తెలిపారు. మంత్రివర్గ సిఫారసుతో అన్ని అంశాలను జత చేయలేదని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పేర్లను ఆమోదిస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదని డా. తమిళసై స్పష్టం చేశారు. పైగా, సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుందని తెలిపారు. 

రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని మంత్రి మండలి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిలిసై సెప్టెంబర్ 19వ తేదీనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గతంలోనూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం సిపార్సు చేయగా, అప్పుడు కూడా తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచే కేసీఆర్ సర్కారుకు గవర్నర్ తమిళిసైకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.  అప్పుడు కూడా కౌశిక్‌రెడ్డి ఎక్కడా సేవా కార్యక్రమాలు చేసినట్లు కనిపించలేదని తిరస్కరించారు. తాజాగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు కూడా ఇలాంది ఎదురుదెబ్బ తగిలింది.
కాగా, మొన్నటి వరకు రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్‌కు ఉన్న దూరం ఇప్పుడిప్పుడే తగ్గుతుందనుకుంటున్న వేళ ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులను గవర్నర్ మరోసారి తిరస్కరించటంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్టయింది.  ఇటీవల మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా వచ్చారు. 
ఆ సమయంలో తమిళిసైతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం నూతన సచివాలయాన్ని సందర్శించి అక్కడే నిర్మించిన చర్చి, గుడి, మసీదులను ప్రారంభించారు. అనంతరం అనేక సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్‌ను తమిళిసై పొగడ్తలతో ముంచెత్తారు. 
ఈ పరిణామాలతో ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య చోటుచేసుకున్న గ్యాప్ తొలగిపోయిందని భవిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ విలీనం బిల్లును కూడా ఇటీవల ఆమె ఆమోదించారు. ఇంతలోనే ప్రభుత్వం సిఫార్సు చేసి పంపించిన గవర్నర్ కోటా అభ్యర్థులను తమిళిసై తిరస్కరించడంతో బీఆర్ఎస్ నాయకులు షాక్‌కు గురయ్యారు.