
ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు ఆర్టీసీ రాయితీ అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డు చూపించి ఈ రాయితీ పొందవచ్చని తెలిపింది. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లు ఎలాంటి కార్డులు లేకుండానే టికెట్ పై రాయితీ లభించే అవకాశం కల్పించనున్నారు.
ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఆరు రకాల ఐడీ కార్డులు చూపిస్తే టికెట్ పై 25 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇందులో ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు ఉన్నాయి.
ఈ ఆరు కార్డుల్లో ఏదో ఒక కార్డు తమ వెంట తీసుకెళ్లడంతో పాటు బస్సుల్లో కండక్టర్ కు చూపిస్తేనే రాయితీపై టికెట్ ఇస్తున్నారు. సెల్ ఫోన్ లో ఆధార్ కార్డును చూపించిన దానిని రుజువుగా భావిస్తామని పేర్కొన్నారు. ఈ కార్డుల్లో ఏ ఒక్కదాన్ని చూపించినా వృద్ధులకు టికెట్లలో ఇప్పటివరకు 25 శాతం రాయితీ కల్పించారు. లేకపోతే రాయితీ ఇవ్వడం లేదు. కానీ వృద్ధులు తమతో పాటు వీటిని గుర్తుపెట్టుకుని తీసుకెళ్లడం కష్టంగా మారింది.
ఈ విషయంలో సీనియర్ సిటిజన్ల నుంచి ప్రభుత్వానికి పలు వినతులు అందాయి. బస్సుల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో అనుమతిస్తున్న ఆరు ఐడీ కార్డుల్ని డిజిటల్ రూపంలోనూ అనుమతించాలని వారు కోరారు. దీంతో వారి విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఏపీ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో ఇకపై ఈ కార్డుల్ని ఫోన్లో డిజిటల్ రూపంలో ఉన్నా అనుమతించేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇందులో ఆధార్ కార్డు మాత్రమే డిజిటల్ రూపంలో ఉండటంతో దాన్ని మాత్రమే అనుమతిస్తారు.
ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టికెట్లతో పాటు ఆర్టీసీ ఓపీఆర్ఎస్ కౌంటర్లలోనూ, ఏటీబీ ఏజెంట్ల ద్వారా ఇచ్చే టికెట్లకూ ఇదే నిబంధన వర్తింప చేయాలని ఆర్టీసీ ఈడీ డీఎంలకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ మూడు చోట్ల కూడా వృద్ధులు కేవలం ఆధార్ కార్డు ఫోన్లో చూపించి 25 శాతం రాయితీపై టికెట్లు పొందేందుకు అవకాశం లభించింది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ